జీహెచ్ ఎంసీలో రాజ‌కీయ వేడెక్కుతోంది. మేయ‌ర్‌ను ఎన్నుకునే తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో పార్టీలు బ‌లాన్ని స‌మ‌కూర్చుకునే ప‌నిలో ప‌డ్డాయి. టీఆర్ ఎస్‌-మ‌జ్లిస్‌-బీజేపీ పార్టీల‌కు దేనికి పూర్తిస్థాయి సంఖ్య‌బ‌లం ద‌క్క‌క‌పోవ‌డంతో ఏవైనా రెండు రాజ‌కీయ ప‌క్షాలు క‌లిస్తేనే మేయ‌ర్ పీఠాన్ని ద‌క్కించుకుని పాల‌నా బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు ఆస్కారం ఉంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే  జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్ధసారథి నోటీఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 11న ఉదయం 11 గంటలకు కొత్త కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 11న మధ్యాహ్నం 12:30కు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ఉంటుంది.



ఎన్నిక పర్యవేక్షణకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని నియమిస్తారు. గత ఏడాది డిసెంబర్ నెల‌లో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించగా.. ఎన్నికల ప్రక్రియ పూర్తై నెల రోజులు దాటినా కూడా మేయ‌ర్ ఎన్నిక‌ల జ‌ర‌గ‌లేదు. ఎన్నిక గురించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ బీజేపీ కార్పోరేటర్లు ధర్నా నిర్వహించారు. దీంతో ఇటీవలనే కొత్త కార్పోరేటర్లు ఎన్నికైనట్టుగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల ప్రక్రియకు షెడ్యూల్ విడుదల చేసింది.జీహెచ్‌ఎంసీ 150 డివిజన్లు ఉండగా టీఆర్‌ఎస్‌-56, బీజేపీ-48, మజ్లిస్‌-44, కాంగ్రెస్‌-2 స్థానాలు ఉన్నాయి. ఎక్స్‌-అఫిషియోలతో కలిపి పార్టీల బలాబలాలను పరిశీలిస్తే. కాంగ్రెస్ కు ఇద్దరు కార్పొరేటర్లు, ఒక ఎక్స్‌-అఫిషియోతో కలిపి మూడు ఓట్లు ఉంటాయి.


బీజేపీకి 48 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్‌-అఫిషియోలతో కలిపి వారి బలం 51 ఉంది. బీజేపీకి మేయర్ సీటు దక్కాలంటే 90 సభ్యుల మద్దతు ఉండాలి. అంతటి బలం బీజేపీకి మేయర్ ఛాన్స్ లేదు. మజ్లి్‌స్ కు 44 మంది కార్పొరేటర్లు, 10 మంది ఎక్స్‌-అఫిషియోలతో కలిపి మొత్తం బలం 54. టీఆర్‌ఎస్ కు 55 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 35 మంది దాకా ఎక్స్‌-అఫిషియో సభ్యులు ఉన్నారు. దీంతో టీఆర్ ఎస్ బలం 90 ఉంది.  మొత్తం కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యుల్లో కనీసం సగం మంది ఉంటేనే సమావేశాన్ని నిర్వహిస్తారు. ఆ సమావేశంలో కార్పొరేటర్లుగా గెలిచినవారు ప్రమాణ స్వీకారం చేశాక ఎన్నిక ప్రక్రియను మొదలుపెడతారు. ఉదాహరణకు ఎక్స్‌అఫీషియోలు, కార్పొరేటర్లు కలిపి 200 మంది ఉంటే కనీసంగా వందమంది హాజరైతేనే ప్రత్యేక అధికారి సమావేశాన్ని నిర్వహిస్తారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఒక జిల్లా కలెక్టర్‌ను ప్రత్యేక సమావేశ నిర్వహణ కోసం ప్రిసైడింగ్‌ అధికారిగా నియమిస్తారని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: