సీఎం జ‌గ‌న్‌లో చాలా ప‌ట్టుద‌ల ఉన్న మాట వాస్త‌వం. వైఎస్ మ‌ర‌ణాంత‌రం జ‌గ‌న్ సోనియా గాంధీని క‌లిసి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే ఎంతో ప‌ట్టుద‌ల‌తో పోరాడి సీఎం అయ్యారు. జ‌గ‌న్ కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డ‌మే ఓ సంచ‌ల‌నం. జ‌గన్ పార్టీ పెట్టిన‌ప్పుడు చాలా మంది అవ‌మానించారు.. అనుమానించారు. జ‌గ‌న్ త‌న‌ను తాను చాలా ఎక్కువుగా ఊహించుకుంటున్నాడ‌న్న విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. అయితే ఎన్నో అవ‌మానాల‌ను దిగ‌మింగి.. ఎంతో ప‌ట్టుద‌ల‌తో పోరాడి తిరుగులేని విధంగా 151 సీట్లు సాధించి అధికారంలోకి వ‌చ్చారు.

అయితే జ‌గ‌న్ సీఎం అయిన‌ప్ప‌టి నుంచే తాను చెప్పిందే వేదం అన్న మొండి ప‌ట్టుద‌ల‌తోనే ముందుకు వెళుతోన్న ప‌రిస్థితి నెల‌కొంది. అంతా తాను చెప్పిన‌ట్టు జ‌ర‌గాల‌న్న జ‌గ‌న్ పంతం పార్టీలోనో లేదా ప్ర‌భుత్వంలోనో జ‌ర‌గ‌వ‌చ్చేమో గాని.. రాజ్యాంగం, వ్య‌వ‌స్థ‌లు, న్యాయ వ్య‌వ‌స్థ విష‌యంలోనూ తానే సుప్రీం అన్న‌ట్టు జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తే కుదిరే ప‌నికాదు. అందుకే జ‌గ‌న్ ప‌దే ప‌దే కోర్టుల చేత మొట్టికాయ‌లు వేయించుకుంటున్నారు. బాధ్య‌త క‌ల ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తాను పాడిందే పాట‌.. గీసిందే గీత‌... ఆడిందే ఆట‌.. చెప్పిందే వేదం.. చేసిందే శాస‌నం అన్న మంకు ధోర‌ణితో ముందుకు వెళ్ల‌డం వ‌ల్లే ఈ రోజు కోర్టుల నుంచి మొట్టికాయ‌లు త‌ప్ప‌డం లేదు.
 
జ‌గ‌న్ చుట్టూ ఉన్న స‌ల‌హాదారులు, న్యాయ నిపుణులు కూడా స‌రైన గైడెన్స్ ఇవ్వ‌క పోవ‌డం వ‌ల్లే జ‌గ‌న్ వ్య‌క్తిగ‌త ఇమేజ్ దెబ్బ తింటోంది. తాజాగా నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌తో ఢీ అంటే ఢీ అనే రీతిలో ఫైట్ చేసినా.. ఈ పోరులో ఓట‌మి అంగీక‌రించక త‌ప్ప‌లేదు. సుప్రీం తీర్పు కూడా రాజ్యాంగ వ్యవస్థ లతో గేమ్స్ వద్దు అన్న సంకేతాలను పంపింది. అంతేకాక తీవ్ర స్థాయిలో స్పందించింది. మ‌రి ఇప్ప‌ట‌కీ అయినా జ‌గ‌న్ రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌లు, న్యాయ వ్య‌వ‌స్థ‌ల‌తో పెట్టుకోక పోవ‌డ‌మే మంచిదేమో ?

మరింత సమాచారం తెలుసుకోండి: