మోడీ రోజ్‌గార్‌... ఇప్పుడిదే సోషల్ మీడియాలో టాప్‌ ట్రెండింగ్‌. ఎక్కడ చూసినా... దీని గురించే చర్చ జరుగుతోంది. నిరుద్యోగులందరూ...నిలదీస్తున్నారు. ఉద్యోగం ఎక్కడ అంటూ ప్రశ్నిస్తున్నారు. మోడీ.. ఉద్యోగమివ్వు అంటూ కొద్ది రోజులుగా...యువత పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా గొంత్తెతున్నారు. వారం రోజులుగా సోషల్ మీడియాలో మోడీ రోజ్‌గార్‌ దో అనే హ్యాష్‌ట్యాగే టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ హ్యాష్‌ట్యాగ్‌పై సుమారు 50 లక్షల పోస్ట్ లు వచ్చాయి. ఇంకా పెద్ద సంఖ్యలో వస్తూనే ఉన్నాయి.

2014 ఎన్నికలకు ముందు... ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ... ప్రచారంలో హామీ ఇచ్చారు ప్రధాని మోడీ. దీన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. మన్మోహన్ హయాంలో నిరుద్యోగం గురించి మోడీ చేసిన సోషల్ మీడియా పోస్ట్ లు, వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఆదాయ ఆర్జన కోసం పకోడీలు వేసుకొమ్మని మోడీ చేసిన వ్యాఖ్యలపై మీమ్స్‌తో నిరసన తెలుపుతున్నారు. యువత మన్‌ కీ బాత్ వినండి... ప్రసంగాలు, వాగ్దానాలు కాదు ఉద్యోగాలు ఇవ్వండి అంటూ పోస్ట్ ల వరద పారిస్తున్నారు.

యువతకు దేశంలో ఉద్యోగాలు కరువయ్యాయి. దేశం మొత్తమ్మీద ఉద్యోగుల సంఖ్య 40.6 కోట్లు ఉంటే...ఇందులో 30 ఏళ్లలోపు వారు కేవలం ఐదో వంతు మాత్రమే ఉన్నారు. అంటే ప్రతి ఐదుగురిలో ఒక్కరు మాత్రమే యువత. అధికారిక లెక్కల ప్రకారం...2020 నాటికి దేశంలో నిరుద్యోగిత రేటు 23.74 శాతంగా ఉంది. మోడీ అధికారంలోకి వచ్చే సమయానికి...నిరుద్యోగ రేటు 5.61శాతం ఉంటే.... 2020 డిసెంబరు నాటికి 7.8 శాతానికి చేరింది. నిరుద్యోగుల్లో యువతే అధిక సంఖ్యలో ఉన్నారు. ప్రతి ముగ్గురిలో ఒక గ్రాడ్యూయేట్ మాత్రమే ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగాల్లో ఇలా యువత వాటా తగ్గడం దీర్ఘకాలంలో దేశాభివృద్ధిపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి యువత ఉద్యోగాల కోసం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: