తెలంగాణలో అద్భుత శిల్ప సంపదకు నిలయం చారిత్రక రామప్పఆలయం. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అద్భుత ఆలయాన్ని హెరిటేజ్ సైట్ గా గుర్తించాలని కేంద్రం యునెస్కోకు నామినేట్ చేసింది. రామలింగేశ్వరాలయం కాకతీయుల గొప్పతనానికి ప్రతీకగా నిలిచింది. చైనాలోఈ నెల16నుంచి 31వరకు జరిగే వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశాల్లో ప్రకటన రానున్నట్టు సమాచారం.

వరంగల్లు పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. శిల్పకళా విశిష్టతతో వెలుగొందుతోంది. కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య క్రీస్తు శకం 1213లో నిర్మించాడు.ఈ కాకతీయ శిల్పకళ ఇన్ని సంవత్సరాలు గడిచినా.. ఈ నాటికి చెక్కుచెదరకుండా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నాట్యశిల్పమంతా రామప్ప గుడిలో తొణికిసలాడుతూ ఉంది.

ఈ శివాలయంలో ఉన్న దైవంపేరు మీదుగా కాకుండా శిల్పకారుడు రామప్ప పేరు మీదుగా ఈ గుడి ఉండటం విశేషం. రామప్పకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది.ఈ గుడి తూర్పు దిశగా గర్భాలయం, అంతర్భాగాన మూడు వైపుల ప్రవేశ ద్వారంతో మహామండపం కలిగి ఉంటుంది. గర్భాలయంలో ఎత్తైన పీఠంపై నల్లని నునుపు రాతితో పెద్ద శివలింగం ఉంది. ఇఖ మహామండపం మధ్యలో కుడ్య స్తంభాలు, వాటిపై గల రాతి దూలాలు రామాయణ, పురాణ, ఇతిహాస గాథలతో చెక్కబడిన శిల్పాలు ఉంటాయి.  

రామప్ప చెరువు కట్ట దగ్గరనున్న దేవాలయంలోపల స్త్రీలు మద్దెల వాయిస్తూ ఉండగా, వివిధ భంగిమలలో నృత్యం చేస్తున్న  ఆటకత్తెల చూపరులను ఆశ్చర్యపరుస్తాయి. ఆ కోటలోనే స్వంభూ దేవాలయలో శివ తాండవ నృత్యం విశేషంగా ఆకట్టుకుంటుంది. హనుమ కొండ వెయ్యి స్థంభాల గర్బగుడి ద్వార బంధాలమీడ వివిధ నాట్యాల నృత్య భంగిమలలో స్త్రీల శిల్పాలున్నాయి. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది. ఇది ఇప్పటికి వేల ఎకరాల పంటకు ఆధారంగా ఉంది. ఇన్ని విశిష్టతలకు నెలవుగా ఉన్న రామప్ప ఆలయంలోయునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోబోతుండటం గర్వంచదగ్గ విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: