అమెరికాకు చెందిన ప్రముఖ స్పేస్ ఫ్లైట్ సంస్థ ‘వర్జిన్ గెలాక్టిక్’ అంతరిక్ష నౌకలో వ్యోమగామి శిరీష తన అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి తెలుగు మహిళగా ఖ్యాతి గడించింది. అంతరిక్ష పర్యటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ చేపట్టిన ప్రయోగంలో శిరీష భాగస్వామి అయ్యింది. ఈ సంస్థ తమ అంతరిక్ష నౌకను విజయవంతంగా నింగిలోకి పంపింది. ఇప్పటికే మూడుసార్లు స్పేస్ ఫ్లైట్లను ఆకాశంలోకి పంపిన చరిత్ర ఈ సంస్థకు ఉంది.
అలాంటి సంస్థ తొలిసారి మనుషుల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. న్యూ మెక్సికో నుంచి బయలుదేరిన ఈ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా శిరీష సహా ఆరుగురు ప్రతినిధులు అంతరిక్షంలోకి వెళ్లారు. వీరిలో ఇద్దరు పైలట్లు కాగా.. ఆ సంస్థ అధిపతి రిచర్డ్ బ్రాన్సన్ కూడా ఉన్నారు. ఈ సంస్థకు చెందిన మరో ముగ్గురు ప్రతినిధులు కూడా అంతరిక్ష యాత్ర చేశారు. ఇలాంటి ఘనత సాధించిన భారతీయ సంతతికి చెందిన శిరీష వర్జిన్ గెలాక్టిక్ లో ప్రభుత్వ వ్యవహారాలు చూసే ఉపాధ్యక్షురాలి హోదాలో ఉన్నారు.
ఇవాళ రాత్రి భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు విమానం గాల్లోకి ఎగిరింది. రాత్రి 8.30కు అంతరిక్ష యాత్ర మొదలైంది. ఈ మానవ సహిత అంతరిక్ష యానంలో శిరీష పాల్గొంటోందని తెలిసి ఆమె స్వస్థలం గుంటూరు జిల్లాలో సంబరాలు జరిగాయి. ఇక శిరీష నేపథ్యం పరిశీలిస్తే.. ఆమె తల్లిదండ్రులు అనూరాధ, మురళీధర్ గుంటూరు వారే. శిరీష పుట్టిన తర్వాతే వారు అమెరికా వెళ్లిపోయి అక్కడే స్థిరపడ్డారు. వీరు ఇప్పుడు వాషింగ్టన్‌లో ఉంటున్నారు. మొత్తానికి తన చిన్ననాటి కల నిజం చేసుకుంది శిరీష.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి