ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిద్ధిపేట, వరంగల్ జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. కుండపోత వర్షాలకు పలు చెరువులకు గండి పడింది. సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లిలో ఇళ్లు, పంటపొలాలు నీటమునిగాయి. బస్వాపూర్ దగ్గర వాగు ఉద్ధృతికి సిద్ధిపేట-హనుమకొండ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. అటు ఏపీలోని కర్నూలు, వైజాగ్, గుంటూరు, విజయవాడలో వర్షం పడుతోంది.
ఉత్తర తెలంగాణలో వర్షాలపై సీఎస్ సోమేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి సమీక్షలో పాల్గొన్న సీఎస్.. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం కలెక్టర్లు, ఎస్పీలకు కీలక సూచనలు చేశారు. భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలన్న సీఎస్.. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని వారికి ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణలో భారీ వర్షాల దృష్ట్యా నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్ జిల్లాల్లో అధికారులు కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. మరో రెండు, మూడు రోజులు వర్షాలు పడే అవకాశమున్న కారణంగా.. నిజామాబాద్ కలెక్టరేట్ లో 086462-220183, ఎలక్ట్రిసిటీ కంట్రోల్ రూమ్ నెం.9440811600, కామారెడ్డి కంట్రో రూమ్ నెంబర్లు 9912458572, 9441264323, వరంగల్ కార్పొరేషన్ నెంబర్లు 18004251980, 9701999645 నెంబర్లను అందుబాటులో ఉంచారు.
మొత్తానికి తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాదు తీర ప్రాంత ప్రజలు సైతం గజగజ వణికిపోతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి