దేశంలోనే అతి పెద్ద డ్రగ్ రాకెట్‌కు బెజవాడ లింకులు ఉన్నాయని వెల్లడి కావడంతో విజయవాడ నగర పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విజయవాడలో ఇప్పటివరకు గంజాయి , హుక్కా లాంటి మత్తు పదార్థాలు లాంటివే అక్రమ రవాణా చేస్తూ ఉండేవారు. కానీ ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయిలో హెరాయిన్ అక్రమ రవాణాతో విజయవాడకు లింకులు ఉన్నాయని తేలడంతో పోలీసు ఉన్నతాధికారులు సైతం షాక్‌కు గురయ్యారు.

దాదాపు రూ.9 వేల కోట్లు విలువజేసే హెరాయిన్‌ను అఫ్ఘనిస్థాన్‌ నుంచి బెజవాడకు తరలిస్తుండగా గుట్టు దందా బయటపడింది. టాల్కం పౌడర్‌ పేరిట కంటైనర్‌లలో తరలిస్తుండగా గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో ఉన్న ముంద్రా పోర్టులో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌, నార్కోటిక్స్‌ బ్యూరో అధికారులు సీజ్‌ చేశారు. అఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్‌కు చెందిన హసన్‌ హుస్సేన్‌ లిమిటెడ్‌ అనే సంస్థ వీటిని పంపినట్లు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఆశి ట్రేడింగ్‌ ఫర్మ్‌ అనే సంస్థ వీటిని బుక్‌ చేసుకుంది. కాగా కన్సైన్‌మెంటులో కనబరిచిన చిరునామా ప్రకారం బెజవాడలోని సత్యనారాయణ పురం ప్రాంతానికి అధికారులు వెళ్లారు. అయితే అక్కడ ఓ చిన్న ఇల్లు మాత్రమే ఉండటం గమనార్హం. దీనిపై డీఆర్‌ఐ, కస్టమ్స్‌ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

దేశంలోనే అతిపెద్ద డ్రగ్స్‌ రాకెట్‌తో విజయవాడకు లింకులున్నాయా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. ఇరాన్‌కు చెందిన రెండు నౌకల్లో భారత్‌కు వస్తున్న 2,988 కిలోల హెరాయిన్‌ను నిఘా పెట్టి గుజరాత్‌లో పట్టుకున్నారు. ఇరాన్‌ దేశంలోని బందర్‌ అబ్బాస్‌ ఓడరేవు నుంచి బందరు పోర్టుకి దిగుమతి చేసుకుంటున్నట్టు వెల్లడైంది. 988 కిలోల చొప్పున కంటైనర్లలో వాటిని ముంబైకి చేర్చేలా దిగుమతిదారులు బుక్‌ చేసినట్లు గుర్తించారు. కంటైనర్‌లలో డబ్బాలలో ఉంచిన పౌడర్‌ని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో పరీక్షించారు. అది హెరాయిన్‌ అని తేలిన తర్వాత ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పట్టుబడిన వారిలో ఇరువురు అఫ్ఘానీయులు ఉన్నారు.

విజయవాడ సత్యనారాయణపురంలో ఉన్న ఆశి ట్రేడింగ్‌ కంపెనీలో అధికారులు సోదాలు చేసినట్లు సమాచారం. గోవింద రాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఇదిలావుంటే, భారీ మాదకద్రవ్యాల అక్రమ రవాణా వ్యవహారంలో విజయవాడకు చెందిన ఏజెన్సీతోపాటు స్థానిక వ్యక్తుల ప్రమేయం కూడా ఉందని వెల్లడి కావడంతో ఏపీ పోలీస్‌లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అంత పెద్ద మొత్తంలో తీసుకొస్తున్న డ్రగ్‌ను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారా? లేక ఒక్క ఏపీకేనా? ఇందులో ఎవరైనా పెద్దల పాత్ర ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: