టీడీపీ నేత అశోక్‌గజపతి రాజు కొన్నాళ్లుగా సైలంట్‌గా ఉంటున్నారు. మాన్సాస్‌ ట్రస్టు ఛైర్మన్‌గా గతంలో తొలగించబడి.. మళ్లీ కోర్టుకు వెళ్లి దాన్ని దక్కించుకున్న అశోక్‌ గజపతిరాజు.. ఆ తర్వాత కూడా సైలంట్ గానే ఉంటున్నారు. అనవసర వివాదాలు వ్యాఖ్యల జోలికి వెళ్లడం లేదు. దీంతో మాన్సాస్‌ ట్రస్టు వివాదం.. కొన్నాళ్లుగా సద్దుమణిగింది. తాజాగా విజయనగరంలోని పైడితల్లి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న అశోక్‌గజపతి రాజు.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయన ఈ ఆలయ అనువంశిక ధర్మకర్త కూడా.


అశోక్‌గజపతి రాజు కుటుంబానికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందజేశారు. పైడితల్లి అమ్మవారిని దర్శించుకోవడం మహా భాగ్యంగా భావిస్తున్నానన్న అశోక్‌ గజపతిరాజు.. అందరూ సంతోషంగా ఉండాలని పండగ సందర్భంగా అమ్మవారిని కోరుకున్నానన్నారు. కరోనా ఉన్నందున అందరూ జాగ్రత్తలు పాటించాలని అశోక్‌ గజపతి విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో అశోక్‌ గజపతి కొన్ని షాకింగ్‌ కామెంట్స్‌ కూడా చేశారు.


ప్రభుత్వం అన్ని మతాలను గౌరవించడం ధర్మం అంటున్న అశోక్‌ గజపతి.. అన్ని మతాల వారు మిగతా మతాల పండగలకు సహకరించాలన్నారు. ఆలయంలో ఉచిత దర్శనం అందరికీ అందుబాటులో ఉండాల్సిందేనని.. అది భక్తుల హక్కు అని అశోక్‌ గజపతి అన్నారు. ఉచిత దర్శనాలపై అధికారులు ఆలస్యంగా ప్రకటన చేసి.. భక్తులను అయోమయానికి గురి చేశారని అశోక్‌ గజపతి ఆగ్రహం వ్యక్తం చేశారు.


ప్రోటోకాల్ వివాదంపైన కూడా అశోక్‌ గజపతి స్పందించారు. ప్రోటోకాల్ అన్నది ఒకొక్క దగ్గర ఒకలా అమలు చేస్తున్నారన్న అశోక్‌ గజపతి.. పండగ సమయంలో ప్రోటోకాల్ ఉండదని స్పష్టం చేశారు. టీడీపీ హయంలో 300 రూపాయలు టిక్కెట్లు పెట్టారని ఇప్పుడు కొందరు ఆరోపణలు చేస్తున్నారని.. టీడీపీకి అమ్మవారి పండగతో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. తాను ప్రశ్నిస్తున్నాననే ఆలయాల ధర్మకర్త పదవి నుంచి తొలగించారని.. కానీ కోర్టు ద్వారా నాయ్యం పొందగలిగానని అశోక్‌ గజపతి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: