ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా రెండేళ్ల క్రితం తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు బిల్లును వైఎస్ జగన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మరోసారి సమగ్రంగా చర్చించి.... మళ్లీ తీసుకువస్తామన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అయితే మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకునే ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్ ప్రసంగం కంటే ముందు... రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. ఇందులో ఆయన అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ బిల్లును పునరుద్ధరిస్తూ అసెంబ్లీలో మరో బిల్లును ప్రవేశపెట్టారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అలాగే పాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృత అభివృద్ధి చట్టం రద్దు బిల్లును కూడా సభ ముందుకు తీసుకువచ్చారు. అలాగే వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీ బిల్లును కూడా తక్షణమే రద్దు చేస్తున్నట్లు బుగ్గన ప్రకటించారు. ఇదే సమయంలో బుగ్గన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ ప్రాంతానికి అన్ని సంస్థలు కేటాయించారని... అందువల్ల ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు పూర్తిగా వెనుకబడిపోయాయన్నారు.

అయితే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిండు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి అబద్ధాలు చెప్పారంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణతో సమానంగా ఆంధ్ర ప్రాంతానికి కూడా సమాన న్యాయమే జరిగిదన్నారు. ఇందుకు తగిన సాక్ష్యాలున్నాయని కూడా వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ నగరానికి కేంద్రం ఎన్నో సంస్థలను కేటాయించిన విషయాన్ని బుగ్గన మర్చిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. విశాఖలో కేంద్రానికి చెందిన 20 పబ్లిక్ సెక్టార్ సంస్థలు ఉన్నాయన్నారు. విశాఖ స్టీల్ సిటీ, బీహెచ్ఈఎల్, బీహెచ్‌వీపీ, వీపీటీ, హెచ్‌పీసీఎల్, ఐఓసీ, ఎన్‌టీపీసీ, కోరమండాల్ ఫెర్టిలైజర్స్ సంస్థ, బీపీసీఎల్, ఎన్‌టీఎస్ఎల్, డీసీఐ సహా పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు విశాఖలో ఉన్న విషయాన్ని బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి మర్చిపోయారా అని సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదే విషయాన్ని పలువురు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు కూడా గుర్తు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: