ఏపీ పోలీసులు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు సరికొత్త విధానాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే ఫ్రెండ్లీ పోలీసింగ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతోంది. పోలీసు స్టేషన్ లలో సమస్యలు పరిష్కారం కాకపోతే నేరుగా ఎస్పీలకు ఫిర్యాదు చేసేలా కూడా మార్పులు తీసుకొచ్చారు. ఇలా విభిన్నమైన ఆలోచనలతో పోలీసు వ్యవస్థలో ప్రయోగాలకు కేంద్రంగా మారింది ప్రకాశం జిల్లా. గతంలో ఇక్కడ ఎస్పీగా పనిచేసిన సిద్ధార్ కౌశల్ ఎన్నో మార్పులు చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉపయోగపడేందుకు ప్రత్యేకంగా ఒక టీం ను కూడా ఏర్పాటు చేసి, ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు తాజా ఎస్పీ మల్లిక గార్గ్ కూడా పనిచేస్తున్నారు.

తాజాగా ప్రకాశం జిల్లా పోలీసులు మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారికోసం ఓ ప్రత్యేకమైన ప్రొఫార్మా రెడీ చేశారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకుంటే వెంటనే స్థానిక పోలీసు స్టేషన్ కు వెళ్లి, అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రొఫార్మాలో వివరాలు నమోదు చేసి, అక్కడి రిసెప్షన్ లో అందివ్వాల్సి ఉంటుంది. ఇలా అందించిన వివరాలతో జిల్లా కేంద్రంలోని పోలీస్ ఐటీ కోర్ టీం తన పని మొదలుపెడుతుంది. మొబైల్ ఫోన్ ని ఎవరు వాడుతున్నారో గుర్తించి, వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం అందిస్తుంది. దీంతో పోలీసులు ఆ మొబైల్ ను సేకరించి బాధితుడికి అందజేస్తారు. బాధితులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసే విధానాన్ని ఇలా ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.

ప్రకాశం జిల్లా పోలీసులు ఇందుకోసం ఓ నెంబర్ ను కూడా కేటాయించారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లలేని వారికోసం ఓ ప్రత్యేకమైన ఫోన్ నెంబర్ ఏర్పాటు చేశారు. 9121102266 అనే ఈ నెంబర్ కు తమ ఫోన్ పోయిందంటూ వాట్సాప్ చేసినా సరిపోతుందని ఎస్పీ మల్లిక గార్గ్ చెబుతున్నారు. ప్రజలకు మరింతగా సేవలందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆమె వివరించారు. ఈ నెంబర్ కు సమాచారం అందిన వెంటనే పోగొట్టుకున్న ఫోన్ ను ట్రేస్ చేస్తామని అంటున్నారు. బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇస్తున్నారు. పోలీసుల పట్ల ప్రజల్లో మరింత నమ్మకాన్ని కలించేలా పనిచేస్తామని అంటున్నారు. అయితే ఈ విధానం రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వస్తే మరింతగా ప్రజలకు ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: