నిన్న‌టి వేళ ధ‌ర్నా చౌక్ ద‌ద్ద‌రిల్లిపోయింది. రైతుకు అండ‌గా కాంగ్రెస్ పెద్ద‌లంతా క‌ద‌లి వ‌చ్చి త‌మ సంఘీభావం తెలిపి, ప్ర‌స్తుతం అమ‌లుకు నోచుకుంటున్న కేంద్ర విధానాల‌పై మాట్లాడి చాలా హుషారు నింపారు కార్య‌క‌ర్త‌ల్లో! అయితే ఇదే జోరు ఇక‌పై కూడా ఉంటుందా.. కోమ‌టిరెడ్డి లాంటి లీడ‌ర్లు పైకి నవ్వి వెనుక రేవంత్ కు వ్య‌తిరేకంగా గోతులు త‌వ్వుతున్నార‌న్న ఆరోప‌ణ ఒక‌టి చెరిగిపోనుందా?

కాంగ్రెస్ లో వింత రాజ‌కీయం ఒక‌టి న‌డుస్తోంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు అందుకున్నాక ఇంత‌టి స్థాయిలో ధ‌ర్నా చేసి రెస్పాన్స్ అందుకోవ‌డం మాత్రం ఒకింత ఆశ్చ‌ర్య‌క‌రం. ఒక‌ప్పుడు  రేవంత్ కు ఉత్త‌మ్ కు మ‌ధ్య విభేదాలు ఉన్నాయ‌ని వార్త‌లు న‌డి చేవి. అధ్యక్ష ప‌ద‌వి మార్పు జ‌రిగినాక ఒక‌రిపై ఒక‌రు క‌య్యానికి కాలు దువ్వుకున్నారు. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకున్నారు. ఆ తరువాత క‌లిసి న‌డిచి, త‌రువాత విడిపోయారు. ఈ క్ర‌మంలోనే విభేదాలు ఈ క్ర‌మంలోనే  అభిప్రాయంకు సంబంధించి ఏకీభావ‌న‌లు జ‌రిగాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీవ్ర క‌ష్ట‌కాలంలో ఉంది.


పెద్ద పెద్ద నాయ‌కులు మాత్రం తెర‌పై క‌నిపిస్తూ హ‌డావుడి చేస్తున్నారే కానీ పార్టీని బ‌తికించే ప‌ని మాత్రం చేయ‌డం లేదు. ఈ త‌రుణాన ధ‌ర్నా చౌక్ కేంద్రంగా వ‌రి దీక్ష చేప‌ట్టి పీసీసీ చీఫ్ తో స‌హా ఉత్త‌మ్, కొమ‌టిరెడ్డి, వీహెచ్, రైతు నాయ‌కులు కోదండ రెడ్డి త‌దిత‌రులు ఒకే వేదిక‌ను పంచుకుని కేంద్ర విధానాల‌పై మాట‌ల‌తో దండెత్తారు. చాలా కాలానికి కాంగ్రెస్ లో వ‌చ్చిన ఈ మార్పు ఎంత కాలం ఉంటుందో కానీ ఉన్నంత కాలం మాత్రం పార్టీ న‌డ‌వ‌డిక మార్చేందుకు స‌హ‌క‌రిస్తుంద‌న్న ఆలోచ‌న ఒక‌టి కార్య‌క‌ర్త‌ల నుంచి వినిపిస్తోంది.

మ‌రోవైపు కేసీఆర్ లాంటి బ‌ల‌మైన నేత‌లకు స‌మాధానం ఇవ్వాల‌న్నా, లేదా ఆయ‌న‌కు ఎదురుగా వెళ్లి రాజ‌కీయం చేయాల‌న్నా
ఇప్పుడున్న బ‌లం చాల‌దు.అలానే క్షేత్ర స్థాయిలో పార్టీ బ‌లోపేతం కావాల్సి ఉంది. గులాబీ దండుకు కొంద‌రు కార్య‌క‌ర్త‌లు, నేత‌లు ఆంత‌రంగీకంగా సాయ ప‌డుతున్నారు అన్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ త‌రుణంలో కాంగ్రెస్ పార్టీ మునుప‌టి ప్రాభ‌వం కానీ వైభ‌వం కానీ ద‌క్కించుకోవాలంటే కొంత‌లో కొంత‌యినా నాయ‌కులు మార‌క త‌ప్ప‌దు. అస‌లు రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వాన్నే అంగీక‌రించ‌లేని ద‌శ‌లో ఉన్న‌ప్పుడు ఇలాంటివ‌న్నీ ఊహించ‌డం క‌ష్ట సాధ్యమే!

మరింత సమాచారం తెలుసుకోండి: