ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించే విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. సమయం మించిపోతున్నప్పటికీ దీనికి సంబంధించిన ఫైల్స్ మాత్రం ముందుకు కదలడం లేదు. మరో పదిరోజుల్లో పీఆర్సీ ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతున్నా.. ఆచరణ మాత్రం ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఎంతపర్సంటేజీ ఇస్తారో తెలియకపోయినా పీఆర్సీ అమలుకి కసరత్తులు జరుగుతున్నాయంటున్నారు. సచివాలయ ఉద్యోగుల విషయంలో కూడా ప్రొబేషన్ జాప్యం కొనసాగుతోంది. తాజాగా వీరి ప్రొబేషన్ కి సంబంధించి ఉత్తర్వులు వచ్చాయంటున్నారు. అయితే అది ఎంతవరకు నిజమో తేలాల్సి ఉంది. సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ పీరియడ్ కూడా పూర్తయింది. దీంతో సచివాలయ ఉద్యోగులు కూడా పర్మినెంట్ ఎప్పుడు చేస్తారా.. జీతాలు ఎప్పుడు పెంచుతారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చాక జగన్ వినూత్నమైన గ్రామ, వార్డు, సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. తన మానస పుత్రికలా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి, కాపాడుకుంటూ వస్తున్నారు. దాదాపుగా లక్షా ఇరవై వేల మంది ఉద్యోగులను సచివాలయాల్లో నియమించారు. వీరందరికీ రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ విధించి, ఆ తర్వాత పర్మినెంట్ చేస్తామని చెప్పారు. జీతాలు కూడా ఆ తర్వాత పెంచుతామని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం చెప్పిన రెండేళ్లు పూర్తయింది. దీంతో సచివాలయ ఉద్యోగులు కూడా ప్రభుత్వ నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులను పర్మినెంట్ చేసేందుకు ఓ పరీక్ష పెట్టి, ప్రభుత్వం చేతులు దులుపుకుంది. దీంతో సచివాలయ ఉద్యోగ సంఘాలు ఆందోళన పడుతున్నారు.

అసలే ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఈ రెండు సమస్యలు ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం పీఆర్సీ ప్రకటించాలని ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే రేపోమాపో ఆందోళనకు కూడా సిద్ధమవుతున్నారు. మరోవైపు సచివాలయ ఉద్యోగులు కూడా తమ సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదట పీఆర్సీ అమలవుతుందా..లేక సచివాలయ ఉద్యోగులను పర్మినెంట్ చేసే కార్యక్రమం మొదలవుతుందా అనే సందిగ్ధత నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: