బెజవాడ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దివంగత నేత వంగవీటి  మోహన రంగారావు వర్థంతి సంద్భంగా ఆయన అభిమానులు  కృష్ణా జిల్లా లోని పలు ప్రాంతాలలో చాలా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ఆయన కుమారుడు  వంగవీటి రాధాకృష్ణ కూడా పాల్గోన్నారు. సంచనల వ్యాఖ్యలు చేశారు.  ఇవన్నీ కూడా రాజకీయంగా హీట్ ను పెంచాయి.
బెజవాడ రాజకీయం తీరే వేరుగా ఉంటుంది. ఈ విషయం నేటిది కాదు. ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంత రాజకీయాలు పార్టీలకు అతీతంగా ఉంటాయి. ఇటీవలి కాలంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు రాజకీయ శక్తుల పునరేకీకరణ దిశగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆదివారం దివంగత నేత వంగవీటి మోహన రంగా రావు వర్ధంతి జరిగింది. ఈ కార్యక్రమాలలో  వంగవీటి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గోన్నారు. అదే కార్యక్రమాలలో వైఎస్ ఆర్ సిపి నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.  తెలుగుదేశం పార్టీ నుంచి శాసన సభకు ఎన్నికై ప్రస్తుతం ఆ పార్టీకి దూరంగా ఉన్న వల్లభనేని వంశీ వర్థంతి లో పాల్గోన్నారు. ఈ విషయం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. సామాజిక మాధ్యమాలలో  ఇది సంచారం చేసింది. అదే సభలో వంగవీటి మోహన రంగ తనయుడు,  రాధాకృష్ణ  సంచలన ప్రకటన చేశారు. తనను చంపడానికి రెక్కీ నిర్వహించారని ప్రకటించారు. సమయం వచ్చినపుడు అన్ని విషయాలు బహిరంగ పరుస్తానని కూడా ఆయన చెప్పారు.
కృష్ణా జిల్లా గుడ్లపల్లేరు మండలంలో జరిగిన కార్యక్రమంలో వంగవీటిరాధ, తన చిరకాల మిత్రుడు రాష్ట్రమంత్రి కొడాలి నానీ తో కలసి చిన్నగొన్నూరు లో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదే సభలో కృష్ణా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పల హారిక,తో పాటు వల్లభనేని వంశీ కూడా ప్రసంగించారు. వంగవీటి మోహన రంగారావు సేవలను కొనియాడుతూనే,  ఆయన తనయుడు రాధాకృష్ణ మేలిమి బంగారం అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.
నరసారావు పేట పట్టణంలో జరిగిన కార్యక్రమంలో  పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు.ఎల్ ఏ అంబటి రాంబాబు తదితరులు హాజరయ్యారు. అక్కడ కూడా అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగీవీటి మోహన రంగా రావు హత్య కు కారణం ఎవరో అందరికీ తెలుసునన్నారు.  నరసారావు పేట  నుంచి గతంలో ప్రాతినిథ్యం వహించిన మాజీ హోం మంత్రి ఇందుకు కారణమని పరోక్షంగా  తెలుగుదేశం పార్టీ నేత, దివంగత కోడెల శివప్రసాద్ రావు పేరును చెప్పకనే చెప్పారు అంబటి రాంబాబు.  వంగవీటి వర్థంతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరగడం, వై.ఎస్.ఆర్.సి.పి నేతలు అంతా తామే అయి వ్యవహరించడం, తెలుగుదేశం  శ్రేణులపై పరోక్షంగా విమర్శలు చేయడం తదితర అంశాలన్నీ కూడా రంగా కుటుంబం చుట్టూ రాజకీయం తిరుగుతున్నట్లనిపించింది. రాజకీయ శక్తుల పునరేకీకరణకు ఇది నాందీ కానుందా ?



మరింత సమాచారం తెలుసుకోండి: