సిద్ధూ ఏమిటి ? ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని గెలిపించటం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా ? పంజాబ్ లో కాంగ్రెస్ పరిస్దితి చూస్తుంటే అందరికీ అలాగే అనుమానం వస్తోంది. పంజాబ్ ఎన్నికల్లో ఎలాగైనా మళ్ళీ గెలవాలని కాంగ్రెస్ పార్టీ శతవిధాల ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో అధికారంలోకి రావాలని ఆప్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. గెలుపుకోసం జనాల మద్దతు కూడగట్టుకునేందుకు ఆప్ ఓ పద్దతి ప్రకారం ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ మాత్రం దారి తెన్ను లేకుండా వెళుతోంది.




ఇప్పటివరకు జరిగిన ప్రీ పోల్ సర్వేల్లో ఆప్ దే అధికారమని తేలింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే గడచిన ఐదునెలలుగానే కాంగ్రెస్ గ్రాఫ్ చాలా స్పీడుగా దిగజారిపోతోంది. ఇదే సమయంలో అధికారంలోకి రావటానికి  ఆప్ పడుతున్న కష్టం కన్నా కాంగ్రెస్ లోని కుమ్ములాటలే ఎక్కువగా సాయం చేస్తున్నట్లుంది. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ ఒక్కడు చాలు పార్టీని పాతాళంలో బొంద పెట్టడానికి. సిద్ధూ ఒక అరాచకవాదిగా వ్యవహరిస్తున్నారు.




ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమరీందర్ సింగ్  రాజీనామా చేయటానికి, పార్టీని వదిలేయటానికి సిద్ధూయే ప్రధాన కారణం. సిద్ధూ క్యారెక్టర్ ఏమిటంటే ఎవరితోను పొసగదు. ఎవరు సిద్ధూతో సఖ్యతగా ఉండలేరు. చరణ్ జీత్ సింగ్ చన్నీ సీఎం కాకముందు సిద్ధూకి బాగా సన్నిహితుడు. కెప్టెన్ను దింపేసిన తర్వాత తననే సీఎంగా డిక్లేర్ చేస్తారని సిద్ధూ అనుకున్నాడు. అయితే అధిష్టానం చన్నీని ముఖ్యమంత్రిగా చేయటంతో వెంటనే చన్నీపైన యుద్ధానికి దిగారు. ప్రతి విషయంలోను చన్నీని తప్పుపడుతున్నాడు.




టికెట్ల కేటాయింపు వ్యవహారంలో ఎలాగూ చన్నీ చెప్పినట్లు సిద్ధూ వినే అవకాశంలేదు. మొత్తం తన వర్గానికే టికెట్లు కావాలని పట్టుబడతాడు. అది ఎలాగూ సాధ్యంకాదు కాబట్టి వెంటనే గొడవలు మొదలుపెడతాడు. ఇప్పటికే కాంగ్రెస్ లో కుమ్ములాటలు చూసిన జనాలకు బాగా విసుగొచ్చేసింది. దాంతో బీజేపీకి ఓట్లు వేయలేక, అకాలీదళ్ కు ఓట్లేయటం ఇష్టంలేని జనాలు ఆప్ ఆభ్యర్ధులకు ఏకపక్షంగా ఓట్లు గుద్దినా ఆశ్చర్యపోవక్కర్లేదు.




అంటే పంజాబ్ లో క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీసీసీ అధ్యక్షుడు సిద్ధూకి థ్యాంక్స్ చెప్పుకోవాలేమో. సిద్ధూ గనుక లేకపోతే కాంగ్రెస్ ఇంతగా భ్రష్టుపట్టేదికాదు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయేకొద్దీ ఆప్ గ్రాఫ్ పెరుగుతుంటుంది. అందుకనే ఆప్ గెలుపుకు సిద్ధూ ఒక్కడు చాలని అంటున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: