ఉక్రెయిన్ లోని సుమీ నగరంలో చిక్కుకున్న.. భారతీయ విద్యార్థుల విషయంలో భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. సుమీ స్టేట్ యూనివర్సిటీలో వందల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. సుమీపై రష్యా బలగాలు భీకర దాడులు జరుపుతున్నాయి. ఈ దాడుల్లో వాటర్ పైప్ లైన్లు, పవర్ సిస్టమ్ దెబ్బతిని.. తిండి, నీళ్లు, కరెంట్ లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తమను స్వదేశానికి తీసుకెళ్లాలని కోరుతున్నారు.

ఉక్రెయిన్ లో అడుగడుగున జాతి వివక్ష ఎదురవుతోందని కొంత మంది భారతీయ విద్యార్థులు ఆరోపించారు. రైలు ఎక్కడం మొదలుకొని ఆహారం వరకు అన్ని విషయాల్లోనూ వివక్ష చూపుతున్నారని చెప్పారు. ఆ దేశ పౌరులకే ఎక్కువ ఆహారం ఇస్తున్నారనీ.. కొన్ని రోజులైతే తినడానికి తిండి కూడా ఉండదేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. త్వరగా ఉక్రెయిన్ నుంచి తీసుకెళ్లారని కోరుతున్నారు.

ఉక్రెయిన్ లో ఉద్రిక్తతలతో ఇండియాకు తిరిగొస్తున్న ఎంబీబీఎస్ విద్యార్థుల చదువుకు ఆటంకం లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఎన్ఎమ్ సీ నిబంధనలు సడలించి భారత్, ఇతర దేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ప్రస్తుత ఎన్ఎమ్ సీ రూల్స్ ప్రకారం విదేశాల్లో మెడిసిన్ చదివే విద్యార్థులు అక్కడే పూర్తి  చేయాలి. కోర్సు మధ్యలో వదిలేసి ఇండియాలో పూర్తి చేసేందుకు కుదరదు.

ఇక ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటి వరకు 50 విమానాల ద్వారా 20వేల మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చింది. అయితే యుద్ధం ప్రారంభమైన 10రోజుల తర్వాత చైనా తమ పౌరులను తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. ఉక్రెయిన్ నుంచి బయల్దేరిన తొలి ఛార్టర్ విమానం కాసేపటి క్రితం చైనాలోని హంగ్జాలో ల్యాండ్ అయింది. అమెరికా కూడా పూర్తిగా పౌరులను తరలించలేదు.

మరోవైపు ఉక్రెయిన్ నల్ల సముద్ర తీరంలోని మికొలైవ్ నౌకాశ్రయంలో 21మంది భారత సైనికులు చిక్కుకుపోయారు. ప్రస్తుతం వీరు ఓ కమర్షియల్ షిప్ లో సురక్షితంగా ఉన్నారు. షిప్ లో శాటిలైట్ ఫోన్ అందుబాటులో ఉండటంతో కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతున్నారు. అయితే మికొలైవ్ నౌకాశ్రయాన్ని ఏ క్షణంలోనైనా రష్యా సైనికులు ముట్టడించే అవకాశమున్నట్టు సమాచారం.








మరింత సమాచారం తెలుసుకోండి: