తెలుగు రాష్ట్రం ఏపీ, తెలంగాణగా విడిపోయాక.. రాజకీయంగానూ అనేక మార్పులు వచ్చాయి. టీడీపీ, వైసీపీ ఏపీకే పరిమితం అయ్యాయి. కాంగ్రెస్ ఏపీలో నామమాత్రంగా మారింది. తెలంగాణలో టీఆర్ఎస్‌, ఏపీలో వైసీపీ బలమైన శక్తులుగా నిలిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ, తెలంగాణ రెండింట్లో ఓ పార్టీ సత్తా చాటబోతోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ అంటున్నారు.


వచ్చే ఎన్నికల్లో ఒక్క హైదరాబాద్ లోక్ సభ స్థానం తప్ప... ఆంధ్ర, తెలంగాణల్లోని 41 సీట్లు ఓ పార్టీ గెలుస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఇంతకీ ఆ పార్టీ ఏంటో తెలుసా.. అదే ప్రజాశాంతి పార్టీ అట. అవునంటున్నారు ఆ పార్టీ అధ్యక్షుడు K.A.పాల్. అంతే కాదు.. దక్షిణ భారత రాష్టాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని 175 స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందట. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పనైపోయిందంటున్న పాల్.. ఆ స్థానాన్ని అంటే దేశవ్యాప్తంగా ప్రతిపక్ష స్థానాన్ని ప్రజాశాంతి పార్టీ భర్తీ చేయబోతోందట.


ఇటీవల హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయిన కే ఏ పాల్.. ఆ భేటీ వివరాలను ఢిల్లీలో మీడియాతో పంచుకున్నారు. ఆ సమయంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. మరి ఏపీ, తెలంగాణలో ప్రజాశాంతి పార్టీకి మొత్తం 42 సీట్లకు 41 ఒకటి వస్తే.. మరి టీఆర్‌ఎస్‌, వైసీపీ, టీడీపీ, బీజేపీ పని ఏంటో అంటూ ఆశ్చర్యపోతున్నారు కే ఏ పాల్ మాటలు విన్నవారు. ఒకప్పుడు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన కేఏ పాల్ ఇలాంటి రాజకీయ ప్రకటనలో ప్రెస్ మీట్లతో జోకర్‌ గా మారిపోతున్నారు.


అయితే.. ఇలాంటి విషయాలను కూడా కేఏ పాల్ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతుంటారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కే ఏ పాల్ ఇలాగే హడావిడి చేశారు. కానీ చివరకు ఆయన పార్టీ తరపున పోటీ చేసేవారే కరవయ్యారు. పాపం.. ఇప్పుడు మళ్లీ ఇలా హడావిడి చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే.. ఇలాంటి కేఏ పాల్‌కు అసలు హోం మంత్రి అమిత్‌ షా ఎలా అపాయింట్‌మెంట్ ఇచ్చారా అన్న అనుమానం కలుగుతోంది. అంతే కాదు.. కేఏ పాల్‌ అడగకుండానే.. అమిత్‌ షానే ఆయన్ను పిలిపించుకున్నారట. అదీ అసలైన కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి: