తాజాగా జరిగిన ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికలో ఫైనల్ గా నమోదైన ఓట్లశాతం 64.14. ఇదే నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో నమోదైంది 83.32 శాతం. అంటే అప్పటికి ఇప్పటికి మూడేళ్ళల్లో దాదాపు 19 శాతం ఓటింగ్ తగ్గిపోయింది. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి వచ్చిన మెజారిటి సుమారు 20 వేలు. ఇపుడు జరిగిన ఎన్నికల్లో అధికారపార్టీ పెట్టుకున్న మెజారిటి టార్గెట్ లక్షఓట్లు. 19 శాతం తగ్గిన ఓటింగ్ లో టార్గెట్ లక్ష ఓట్ల మెజారిటి ఎలా సాధ్యం ?

ఇక్కడే వైసీపీ ఫెయిల్యూర్ కనబడుతోంది. ఎందుకంటే అధికారపార్టీ నేతల లెక్కప్రకారమే నియోజకవర్గంలోని 83 వేల కుటుంబాల్లో సుమారు 75 వేల కుటుంబాలకు సంక్షేమపథకాల్లో కచ్చితంగా ఏవైనా రెండు అందుతున్నాయట. ఈ కారణంతోనే తమ అభ్యర్ధి విక్రమ్ రెడ్డికి లక్ష ఓట్ల మెజారిటి ఖాయమని చెప్పారు. మరి పార్టీ నేత చెప్పిందే నిజమైతే ఓటింగ్ శాతం 64 దగ్గరే ఎందుకు ఆగిపోయినట్లు ? సంక్షేమపథకాల లబ్దిదారుల్లో అందరూ ఓటింగ్ రాలేదని అర్ధమైపోతోంది.

పార్టీ నేత చెప్పిందే నిజమైతే ఓటింగ్ శాతం 75 శాతంను టచ్ చేసుండాలి. ఉపఎన్నికల్లో అనేక కారణాల వల్ల ఓటింగ్ శాతం తగ్గుతుందని తెలిసిందే. పైగా ఆత్మకూరులో గెలుపు ముందే ఖాయమైపోయింది కాబట్టి ఓటర్లలో కూడా ఉదాసీనత పెరిగిపోయుండచ్చు. ఇక్కడ గెలుపు విషయాన్ని పక్కనపెట్టేస్తే ఓటింగ్ శాతం తగ్గకూడదన్న ఉద్దేశ్యంతోనే జగన్మోహన్ రెడ్డి ప్రతి మండలానికి మంత్రి, ఎంఎల్ఏలను ఇన్చార్జిలుగా నియమించారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో నమోదైన ఓటింగ్ 59 శాతం మాత్రమే.


ఇక మేకపాటి సొంతమండలం మర్రిపాడులో నమోదైంది కూడా 59.8 శాతమే. అంటే మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితాలూకు సానుభూతి కూడా జనాల్లో తగ్గిపోయిందని అనుకోవాలా ? ఓవరాలుగా చూస్తే ఓటింగ్ శాతం తగ్గిపోవటంలో వైసీపీ ఫెయిల్యూర్ స్పష్టంగా కనబడుతోంది. మరిఇలాంటి నిర్లక్ష్యమే రేపు జనరల్ ఎలక్షన్లలో కూడా కనబడితే పార్టీ పరిస్ధితి ఏమిటి ? ఇపుడు విక్రమ్ కు ఎంత మెజారిటి వస్తుందన్నది పాయింట్ కాదు. ఓటింగ్ శాతం ఎందుకు తగ్గిందన్నదే కీలకం.

మరింత సమాచారం తెలుసుకోండి: