రెండు విషయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలుగుదేశంపార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చాలా బిజీగా కనిపిస్తున్నారు. ఇంతకీ అవి ఏ విషయంలో అంటే చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించటంలో. ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతుల కుటుంబాలకు పరిహారం అందించటం, కుటుంబసభ్యులను ఓదార్చటం పేరుతో పవన్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పటివరకు కర్నూలు, పశ్చిమగోదావరి, అనంతపురం, బాపట్ల జిల్లాల్లో పవన్ పర్యటించారు.

ఇదే విషయమై లోకేష్ కూడా చనిపోయిన వారి కుటుంబాలను కలవటం, కాస్త ఓదార్పుమాటలు చెప్పటానికే పర్యటిస్తున్నారు. చనిపోయిన పార్టీ కార్యకర్తలు, హత్యాచారాల్లో చనిపోయిన వారిఇళ్ళకు, అత్యాచార బాధితురాళ్ళ ఇళ్ళకు లోకేష్ ఎక్కువగా వెళుతున్నారు. వీళ్ళిద్దరి వరసచూస్తుంటే జగన్మోహన్ రెడ్డిని గుడ్డిగా ఫాలో అయిపోతున్నట్లు అనుమానంగా ఉంది. జగన్ కూడా ఒకపుడు ఓదార్పుయాత్రలు చేసిన విషయం గుర్తుందికదా.


తనతండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మృతికారణంగా చనిపోయిన, ఆత్మహత్యలు చేసుకున్న అభిమానుల కుటుంబసభ్యుల ఇళ్ళకు వెళ్ళి జగన్ కలిసొచ్చారు. అప్పట్లో జగన్ చేసిన ఓదార్పుయాత్రలు రాష్ట్రంలో పెద్ద సంచలనం. దానికారణంగానే పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో విభేదాలు మొదలై చివరకు జగన్ పార్టీని వదిలేయాల్సొచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అన్నీ అందరికీ తెలిసిందే.

అప్పట్లో జగన్ యాత్రలే తర్వాత వైసీపీ ఏర్పాటుకు బీజమేసింది. ఓదార్పుయాత్ర చేయటం, సోనియానే ధిక్కరించి పార్టీ వదిలి బయటకు రావటమే జగన్ అంటే జనాల్లో ఒకరకమైన క్రేజు మొదలైంది. అలాంటిది సేమ్ టు సేమ్ అలాంటి యాత్రలనే ఇపుడు పవన్, లోకేష్ ఫాలో అవుతున్నట్లే అనుమానంగా ఉంది. కానీ అప్పట్లో జగన్ చేసిన ఓదార్పుయాత్రకు, ఇపుడు వీళ్ళుచేస్తున్న యాత్రలకు చాలా తేడాలున్నాయి.

అచ్చంగా వైఎస్ అభిమానుల కోసమే అప్పట్లో జగన్ యాత్రచేశారు. కానీ ఇపుడు కౌలురైతుల యాత్ర వివాదాస్పదమైంది. ప్రభుత్వం పరిహారం ఇచ్చినట్లు చెబుతోంది. కుటుంబసభ్యులు కూడా పరిహారం అందిందంటున్నారు. కానీ పవన్ మాత్రం ప్రభుత్వం పట్టించుకోవటంలేదంటు ఆరోపణలుచేస్తున్నారు. అలాగే వ్యక్తిగత గొడవల్లో చనిపోయిన కార్యకర్తలను కూడా ప్రభుత్వమే చంపేసిందంటు లోకేష్ నానా గోలచేస్తున్నారు. మరి ఈ యాత్రలు వీళ్ళకు వర్కవుటవుతాయా ?

మరింత సమాచారం తెలుసుకోండి: