రాష్ట్రంలో రోడ్ల దుస్ధితిపై జనసేన అధినేత పవన్ కల్యాన్ ప్రారంభించిన మూడురోజుల డిజిటల్ నిరసనకు రెస్సాన్స్ బాగానే వస్తోంది. పార్టీ జనాలు రెస్పాండ్ అవుతున్నారా ? లేకపోతే మామూలు జనాలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారా అన్నది వేరే విషయం. రెస్పాన్స్ రెండురకాలుగానూ ఉండచ్చు. ఎందుకంటే రోడ్ల సమస్య అంటే దాని ప్రభావం ప్రతి ఒక్కళ్ళమీదా పడుతుంది కదా. కాబట్టి పవన్ లేవనెత్తిన సమస్య చాలా జెనూయిన్ అనే చెప్పాలి.





అయితే ఇదొక్కటే ఇప్పటికి బహిరంగసభల్లో, పార్టీ వేదికలమీద, ట్విట్టర్, మీడియా సమావేశాల్లో కూడా పవన్ అనేక సమస్యలను లేవనెత్తుతున్నారు. పవన్ ఏమి మాట్లాడినా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అందరికీ అర్ధమైపోతుంది. సరే పవన్ రాజకీయంలో ఇదికూడా ఒక భాగమనే సరిపెట్టుకోవాలి. అయితే ఇక్కడే గడచిన రెండురోజులుగా సోషల్ మీడియా నెటిజన్లు పవన్ను అనేక ప్రశ్నలు వేస్తున్నారు. మరి వాటికి పవన్ ఏమి సమాధానం చెబుతారు ?





ఇంతకీ నెటిజన్లు వేస్తున్న ప్రశ్నలు ఏమిటంటే రోడ్ల పరిస్ధితి ఇపుడే కాదు చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నపుడు కూడా దాదాపు ఇలాగే ఉన్నాయి. మరపుడు పవన్ ఎందుకని నోరెత్తలేదు. ఇలాంటి నిరసనలు అప్పుడెందుకు పవన్ చేయలేదు. ఇక ఉద్యోగాల భర్తీలో జగన్ ఫెయిలయ్యారని పవన్ పదే పదే ఆరోపిస్తున్నారు. చంద్రబాబు హయాంలో కూడా ఉద్యోగాల భర్తీ జరగని విషయం పవన్ కు తెలీదా ? అప్పుడెందుకని నోరిప్పలేదు ?






దాడులు, హత్యాచారాలు చంద్రబాబు హయాంలో కూడా బాగానే జరిగాయి. మరెప్పుడూ వీటిగురించి పవన్ ప్రశ్నించలేదే ? అక్రమ మైనింగ్ జరుగుతోందని ఇపుడు గొంతుచించుకుంటున్న పవన్ టీడీపీ హయాంలో కూడా ఇదే అక్రమ మైనింగ్ విపరీతంగా జరిగింది కదా ? పైగా అక్రమ మైనింగ్ జరిగినట్లు హైకోర్టు కూడా ధృవీకరించింది. మరప్పుడు ఎందుకని పవన్ నోరెత్తలేదు ? సోషల్ మీడియాలో పోస్టులకు వైసీపీ ప్రభుత్వం కేసులు పెడుతోందని గోలచేస్తున్నారు. చంద్రబాబు హయాంలో చాలామందిపైనే కేసులు పెట్టినా అప్పుడెందుకు మాట్లాడలేదు ? అని నెటిజన్ల ప్రశ్నలకు పవన్ సమాధానాలు చెబుతారా ?

మరింత సమాచారం తెలుసుకోండి: