ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు వ్యవహారం అలాగే అనిపిస్తోంది. తాజాగా కర్నూలు పర్యటనలో చంద్రబాబు మాట్లాడుతు  వచ్చే ఎన్నికలే తనకు, పార్టీకి చివరి ఎన్నికలని చెప్పారు. గతంలో తాను చేసిన శపథం నెరవేరాలంటే టీడీపీని జనాలు గెలిపించాల్సిందే అన్నారు. టీడీపీ గెలవకపోతే పరిస్ధితులు చాలా భయంకరంగా ఉంటాయని బేలగా మాట్లాడారు. అంతకుముందు అసెంబ్లీలో మాట్లాడుతు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాతే తిరిగి అసెంబ్లీలోకి అడుగుపెడతానని భీకర ప్రతిజ్ఞ చేశారు.





ఇలాంటి అనేకమాటలు వైసీపీ నేతలు బాగా అందిపుచ్చుకుంటున్నారు. చంద్రబాబు అన్న మాటలనే రివర్సులో ప్రయోగించి బాగా ర్యాగింగ్ చేస్తున్నారు. దాంతో వైసీపీ నేతల ర్యాగింగ్ కు ధీటైన సమాధానం చెప్పుకోవటంలో చంద్రబాబుతో సహా తమ్ముళ్ళంతా నానా అవస్తలు పడుతున్నారు. కర్నూలులో చెప్పినట్లు వచ్చే ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలని మంత్రులు, వైసీపీ ఎంఎల్ఏలు మూకుమ్మడిగా దుమ్ముదులిపేస్తున్నారు. కొత్తప్రోగ్రామ్ ‘ఇదేం ఖర్మ’ను కూడా మంత్రులు, వైసీపీ నేతలు చంద్రబాబుపైన రివర్సులో ప్రయోగిస్తున్నారు.





చాలాకాలంగా రాబోయే ఎన్నికలే టీడీపీకి చివరి ఎన్నికలని మంత్రులు, నేతలు చెబుతున్నారు. ఆ మాటలను నిజంచేస్తున్నట్లుగా చంద్రబాబు తాజా మాటలున్నాయి. చంద్రబాబు మాటలనే మంత్రులు ఎంఎల్ఏలు జనాలకు గట్టిగా వినిపిస్తున్నారు. అలాగే నారా లోకేష్ ను మంత్రులు, యావత్ వైసీపీ ఒక ఫెయిల్యూర్ లీడర్ గా ముద్ర వేసేశారు. ఆ ముద్రను కూడా చంద్రబాబు తన మాటలతో నిజంచేశారు. రాబోయే ఎన్నికల్లో గెలవకపోతే టీడీపీకి అవే చివరి ఎన్నికలవుతాయని చంద్రబాబు అన్నమాటకు అర్దమేంటి ? పార్టీ భవిష్యత్తు తనతోనే ముడిపడుందని చెప్పటమే.





అంటే కొడుకు లోకేష్ అసమర్ధుడని చంద్రబాబే అంగీకరించినట్లయ్యింది. దీన్నే మంత్రులు బాగా హైలైట్ చేస్తున్నారు. సీఎం అయితే కానీ అసెంబ్లీలోకి అడుగుపెట్టనని గతంలో చెప్పారు. ఆ విషయమై అప్పట్లోనే మంత్రులు మాట్లాడుతు ఇక చంద్రబాబు భవిష్యత్తులో అసెంబ్లీలోకి అడుగుపెట్టరని ఎగతాళి చేశారు. అప్పట్లో మంత్రులు ఎగతాళిగా మాట్లాడిన మాటలనే చంద్రబాబు అంగీకరిస్తున్నట్లుగా ఇపుడు మాట్లాడుతున్నారు. దీంతో చంద్రబాబే ప్రత్యర్దులకు ఆయుధాలను అందిస్తున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: