జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతు ఒక మాటన్నారు. అదేమిటంటే ‘సీఎం  పదవి అనేది దానంతట అది వరించి రావాలే కానీ మనం కోరుకుంటే వచ్చేది కాదు’ అని. ఒకరకంగా పవన్ చెప్పింది నిజమే అనుకుందాం. ముఖ్యమంత్రి పదవి లేదా సినిమాల్లో సూపర్ స్టార్ పదవి లాంటవన్నీ కోరుకుంటే దక్కేవి కావని పవన్ చెప్పారు. అంటే పవన్ మాటలు విన్నతర్వాత ఆయన అదృష్టం మీద ఆధారపడినట్లు అర్ధమవుతోంది.





మామూలుగా చాలామంది అంటుంటారు దేనికైనా రాసిపెట్టుండాలని. అంటే మనకు రాసిపెట్టుంటే దానంతట అదే తన్నుకుని వచ్చి మన ఒళ్ళో వాలుతుందనేది జనాంతికం. దాన్నే పవన్ కూడా ఫాలో అయ్యేట్లయితే ఇక రాజకీయాల్లోకి ఎందుకొచ్చినట్లు ? అదృష్టాన్ని మాత్రమే నమ్ముకునేట్లయితే పవన్ ఏపనీ చేయాల్సిన అవసరంలేదు. హ్యాపీగా ఇంట్లో కూర్చుంటే అన్నీ దానంతట అవే వచ్చిపడతాయి కదా. సినిమాల్లో సూపర్ స్టార్ హోదా తాను కష్టపడితేనే వచ్చిందని మళ్ళీ కాసేపటి తర్వాత తానే చెప్పారు.





పవన్ కష్టమేంటో తెలీదుకానీ అందుకు కారణమైన అదృష్టం మాత్రం అన్న చిరంజీవి రూపంలో పవన్ను వరించిందని చెప్పాలి. చిరంజీవే లేకపోతే పవన్ సినిమా ఎంట్రీ కూడా జరిగుండేది కాదేమో. పవన్ కైనా నాగబాబు కైనా సినిమాల్లో అవకాశాలు చిరంజీవి కారణంగా వచ్చినవే తప్ప సొంతంగా వాళ్ళు కృషి చేసిందేమీ లేదు. వాళ్ళిద్దరినీ చూసి సినిమాల్లో నిర్మాతలు బుక్ చేసుకున్నారంటే అది కేవలం చిరంజీవి వల్లే అని అందరికీ తెలిసిందే.





అదృష్టముంటే అన్నీ వాటంతవే వస్తాయనేది పవన్ మాట. కానీ అందుకు మానవ ప్రయత్నం కూడా అవసరమే అన్న విషయాన్ని పవన్ మరచిపోయినట్లున్నారు. ముఖ్యమంత్రి పదవి వరించటాన్ని పవన్ కర్నాటకలో కుమారస్వామిని ఉదాహరణగా చూపించారు. కుమారస్వామి కూడా ఇంట్లో కూర్చుంటే వచ్చి సీఎం పదవి వరించలేదు. సంవత్సరాల తరబడి పార్టీని నడుపుతున్నారు. పార్టీ పటిష్టత కోసం కుమారస్వామి పడుతున్న కష్టాన్ని పవన్ గుర్తించినట్లు లేదు. 2018లో హంగ్ అసెంబ్లీ రూపంలో అవకాశం వచ్చింది కాబట్టి కుమారస్వామి ఉపయోగించుకున్నారు. అవకాశం వచ్చిందంటే జేడీఎస్ 35 సీట్లు గెలవటమే కారణం. అందుకు  కుమారస్వామి ఎంత కష్టపడుంటారు ? మొత్తానికి పవన్ కష్టంకన్నా అదృష్టాన్నే ఎక్కువ నమ్ముకున్నట్లు అర్ధమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: