జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పెద్ద రిలీఫ్ దొరికినట్లే. రాబోయే ఎన్నికల్లో జనేసేన తరపున పోటీచేయబోయే అభ్యర్ధులు అందరికీ కామన్ సింబల్ ఇవ్వటానికి కేంద్ర ఎన్నికల కమీషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కమీషన్ నుండి జనసేన అధినేతకు అధికారిక సమాచారం అందింది. కామన్ సింబల్ అంటే ఇంకేదో కాదు అచ్చంగా గాజుగ్లాసు మాత్రమే అవటంతో పవన్ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. టీ తాగే గాజుగ్లాసు అంటే తెలీని మనిషుండరు.




అలాంటి గుర్తును పవన్ ఏరికోరి జనసేన ఎన్నికల గుర్తుగా తీసుకున్నారు.  2019లో మొదటిసారి పోటీచేసిన జనసేన ఘోరంగా ఓడిపోయింది. కమీషన్ లెక్కల ప్రకారం పార్టీకి సీట్లు లేదా ఓట్లు రాలేదు. దాంతో గాజుగ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ గా కమీషన్ ప్రకటించింది. నిజంగా ఇది పవన్ కు చాలా పెద్ద సమస్యగా మారింది. పార్టీ తరపున పోటీచేయబోయే అభ్యర్ధుల్లో ఎవరికి గాజుగ్లాసు గుర్తు వస్తుందో తెలీదు ఎవరు ఏ గుర్తుపైన పోటీచేయాలో  తెలీదు.




ఎన్నికల్లో ప్రచారం చేసే పవన్ తో పాటు ఓట్లువేసే ఓటర్లను కూడా అయోమయంలోకి నెట్టేస్తుంది. అందుకనే ఎన్నికలగుర్తు అన్నది గెలుపోటముల్లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. అలాంటిది రాబోయే ఎన్నికల్లో జనసేన అభ్యర్ధులు ఏ గుర్తులపై పోటీచేస్తారో తెలీకుండా ఉంది. ఈ నేపధ్యంలోనే పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ పేరుతో ఒక ఫేక్ సర్క్యులర్ చక్కర్లు కొడుతోంది. అందులో ఏముందంటే రాబోయే ఎన్నికల్లో జనసేన అభ్యర్ధులు టీడీపీ గుర్తుపైనే పోటీచేస్తారనుంది.




ఇది ఫేక్ సర్క్యులరే అని అర్ధమవుతున్నా పార్టీ పరిస్ధితికి ఈ ఫేక్ లెటరే అద్దంపడుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కమీషన్ నుండి వచ్చిన సమాచారంతో పవన్ ఫుల్లు హ్యాపీ అయిపోయారు. పోయిందని అనుకున్న, ఇక ఎప్పటికి రాదని ఆశలు వదిలేసుకుంటున్న సమయంలో తమ పార్టీ గుర్తు గాజుగ్లాసు తిరిగి రావటమంటే  మామూలు విషయంకాదు. గాజుగ్లాసు గుర్తును ఎందుకు ఫ్రీ సింబల్ గా గతంలో ప్రకటించిందో ఇఫుడు సడెన్ గా జనసేనకు కేటాయించాలని ఎందుకు నిర్ణయం తీసుకుందో కమీషనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: