జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు తెలంగాణా పెద్ద షాకిచ్చింది. ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుని  జనసేన ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీచేసింది. ఒక్క నియోజకవర్గంలో కూడా కనీసం డిపాజిట్ కూడా వచ్చినట్లు లేదు. వచ్చినట్లు లేదని ఎందుకు అంటున్నదంటే అసలు ఏ మీడియాలో కూడా జనసేన గురించి ఒక్కటంటే ఒక్క వార్త కూడా కనబడలేదు కాబట్టే.  

నిజానికి ఎనిమిది మంది అభ్యర్ధులను పవనే నిండా ముంచేశారు. అసలు తెలంగాణాలో జనసేన ఉనికిలో కూడా లేదు.  ఉనికిలో కూడా లేని జనసేన ఎన్నికల్లో 32 నియోజకవర్గాల్లో పోటీచేస్తుందని పవన్ ప్రకటించటమే పెద్ద జోక్. అలాంటిది చివరకు కమలంపార్టీతో పొత్తు పెట్టుకుని 8 చోట్ల పోటీచేసింది. ఎనిమిది అభ్యర్ధులను అయితే రంగంలోకి దింపారు కానీ వాళ్ళని పవన్ గాలికొదిలేశారనే చెప్పాలి. వాళ్ళ తరపున పవన్ సరిగా ప్రచారం కూడా చేయలేదు. ఏదో మొక్కుబడిగా కొత్తగూడెంలో ఒక సభలో పార్టిసిపేట్ చేశారు.

ఆ సభకే వైరా, ఖమ్మం, అశ్వారావుపేట, మధిర నియోజకవర్గాల అభ్యర్ధులను పిలిపించారు. కొత్తగూడెంలో బహిరంగసభకు మిగిలిన నియోజకవర్గాల అభ్యర్ధులను పిలిపించటం వల్ల ఏమిటి ఉపయోగమో పవన్ కే తెలియాలి. జనసేన ఎన్ని నియోజకవర్గాల్లో పోటీచేస్తున్నదో అన్ని నియోజకవర్గాలకూ పవన్ వెళ్ళి ప్రత్యేకంగా ప్రచారం చేస్తేనే ఏమన్నా ఉపయోగముంటుందన్న ఇంగితం కూడా లేకపోయింది. అందుకనే జనసేన తరపున పోటీచేసిన అభ్యర్ధులను జనాలు అసలు పట్టించుకోలేనే లేదు.

పార్టీ అభ్యర్ధులను అధినేతే పట్టించుకోకపోతే ఇక ఓట్లేయాల్సిన జనాలు మాత్రం ఎందుకు పట్టించుకుంటారు. అందుకనే ఓడగొట్టడం కాదు కనీసం డిపాజిట్లు కూడా ఇవ్వలేదు. మొదటినుండి కూడా తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకోవటం పవన్ కు బాగా అలవాటు. అలవాటే ఇపుడు పవన్ కు తలబొప్పి కట్టించింది. సీమాంధ్రులు, ప్రత్యేకించి తెలుగుదేశంపార్టీ ఓటర్లు జనసేనకు ఓట్లేయలేదన్న విషయం స్పష్టమైపోయింది. మరి దీని ప్రభావం తొందరలో జరగబోయే  ఏపీ ఎన్నికలపై ఎలాగ పడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: