వైఎస్ షర్మిల విషయంలో తెలంగాణాలో ఏమైతే జరిగిందో అదే విషయం ఏపీలో కూడా రిపీటవుతున్నట్లుంది. షర్మిల వైఖరి నచ్చక, ఒంటెత్తుపోకడలను తట్టుకోలేక వైఎస్సార్టీపీలోని చాలామంది మద్దతుదారులు పార్టీని వదిలేశారు. వైఎస్సార్టీపి కాంగ్రెస్ లో విలీనం చేయాలన్న షర్మిల నిర్ణయంతో చాలామంది నేతలు విభేదించి పార్టీలో నుండి బయటకు వచ్చేశారు. దాంతో పార్టీని షర్మిల చాపచుట్టేసి కాంగ్రెస్ లో విలీనం చేసి కొట్టుకట్టేసి ఏపీలోకి వచ్చేశారు.





ఏపీ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి షర్మిల చాలా హడావుడి చేస్తున్నారు. షర్మిల బాధ్యతలు తీసుకునే ముందే మంగళగిరి వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి మద్దతు పలికారు. ఆర్కేకి జగన్ టికెట్ ఇవ్వనని చెప్పటంతో అలిగి షర్మిలతో జాయిన్ అయ్యారు. షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ లో చేరారు. అయితే మంగళవారం కాంగ్రెస్ లో నుండి బయటకు వచ్చేశారు. కారణం ఏమిటంటే షర్మిల ఒంటెత్తుపోకడలు నచ్చకే బయటకు వచ్చేసినట్లు సన్నిహితులకు చెప్పారని ప్రచారం జరుగుతోంది.





పీసీపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి షర్మిల పదేపదే జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. ఇంటి విషయాలను కూడా రోడ్డుమీదకు ఈడ్చి వీలైనంత బురదచల్లాలని ప్రయత్నిస్తున్నారు. జగన్ హయాంలో రాష్ట్రం అన్నీ విధాలుగా నాశనమైపోయిందని ప్రతిరోజు ఆరోపణల మీద ఆరోపణలు చేస్తునే ఉన్నారు. ఇదే సమయంలో విభజిత ఏపీకి మొదటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు గురించి మాత్రం మాట్లాడటంలేదు. అంటే చంద్రబాబు విషయంలో షర్మిల చాలా సాఫ్ట్ గాను జగన్ విషయంలో ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లు అందరికీ తెలిసిపోతోంది.





ఇదే విషయాన్ని షర్మిలతో ఆళ్ళ ఎన్నిసార్లు చెప్పినా ఆమె వినలేదట. జగన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఉపయోగం ఉండదని ఆళ్ళ ఎన్నిసార్లు చెప్పినా షర్మిల వినిపించుకోలేదని సమాచారం. దాంతో షర్మిల రహస్య అజెండాతోనే ఏపీ కాంగ్రెస్ లో చేరినట్లు అర్ధమైపోయిందట. అందుకనే షర్మిలతో లాభంలేదని ఆళ్ళ కాంగ్రెస్ ను వదిలేసి  మళ్ళీ వైసీపీలో చేరారు.  కాంగ్రెస్ లో చేరే ఆలోచనలో ఉన్న రాయదుర్గం ఎంఎల్ఏ కాపు రామచంద్రారెడ్డి కూడా తన నిర్ణయాన్ని మార్చుకున్నారని పార్టీవర్గాలు చెప్పాయి. అంటే షర్మిల విషయంలో తెలంగాణాలో ఏమి జరిగిందే అదే ఏపీలో కూడా జరుగుతున్నట్లు అర్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: