
ఏం జరిగింది..
శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కడపలో నిర్వహించిన కార్యక్రమంలో మాధవికి ప్రత్యేకంగా అధికారులు కుర్చీలు ఏర్పాటు చేశారు. అయితే.. ఆమె తన భర్త, పార్టీ సీనియర్ నాయకుడు రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డితో కలిసి వచ్చే సరికి ఆలస్యమైంది. దీంతో ఆమెకు కేటాయించిన కుర్చీలో ఉన్నతాధికారి ఒకరు కూర్చున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన మాధవి.. జాయింట్ కలెక్టర్ అదితి సింగ్‌పై నిప్పులు చెరిగారు. మీరు ఏం చేస్తున్నారు? అంటూ నోరు చేసుకున్నారు.
ఈ పరిణామంతో ఉలిక్కిపడ్డ అదితి సింగ్ అక్కడే కన్నీటి పర్యంతమయ్యారు. తనకు తెలియదని, వేరే కుర్చీ వేయిస్తానని చెప్పి.. హుటాహుటిన వేరే రెండు కుర్చీలు వేయించారు. అయితే.. తాను ఆ కుర్చీల్లో కూర్చునేది లేదంటూ.. మాధవి అక్కడ నుంచి భర్తతో కలిసి వెళ్లిపోయారు. ఈ పరిణామాలపై కలెక్టర్ ను సీఎంవో అధికారులు వివరణ కోరారు. దీనిపై ఆయన జరిగిందంతా వెంటనే నివేదిక రూపంలో ఇచ్చారు. తమ తప్పులేదని.. తాము ప్రొటోకాల్ ప్రకారం వ్యవహరించామని చెప్పారు.
అయితే.. ఎమ్మెల్యే వచ్చేసరికి ఆలస్యం కావడంతో ఆమె కుర్చీలో వేరే ఉన్నతాధికారి కూర్చున్నారని.. అయినప్పటికీ తాము మరో కుర్చీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, కానీ ఎమ్మెల్యే ఆగ్రహంతో వెళ్లిపోయారని చెప్పారు. ఈ వ్యవహారం సీఎం వరకు చేరడంతో.. అధికారులను ఇన్సల్ట్ చేసేలా వ్యవహరించడం సరికాదని, కార్యక్రమంలో ఒకింత ఓపికగా వ్యవమరించి ఉంటే.. బాగుండేదని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని కూడా సీఎం సూచించినట్టు సీఎంవో వర్గాలు పేర్కొన్నాయి.