
అయితే జేసీ బ్రదర్స్ ఎప్పుడూ స్కెచ్‌లతో ముందే ఉండే వారు. అందుకే పెద్దారెడ్డి ఊహించని కౌంటర్ ప్లాన్ వేసి ఆయన అడుగులు ఆపేశారు. హైకోర్టు స్పష్టమైన ఆదేశాల ప్రకారం, పోలీసులు బందోబస్తు కల్పించి పెద్దారెడ్డిని ఆయన ఇంటి వరకు తీసుకెళ్లాల్సి ఉండేది. అవసరమైతే ఫోర్స్‌ను కూడా వినియోగించుకోవచ్చని కోర్టు పేర్కొంది. కానీ అమల్లో మాత్రం పరిస్థితి తారుమారైంది. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి దిశగా బయలుదేరిన పెద్దారెడ్డిని పోలీసులు మధ్యలోనే ఆపేశారు. తన దగ్గర కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని పెద్దారెడ్డి చూపించినా, ఆయనకు ముందుకు వెళ్ళే అవకాశం ఇవ్వలేదు. దాంతో పెద్దారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసినప్పటికీ, చివరికి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.
మరోవైపు జేసీ ప్రభాకర్‌రెడ్డి కూడా తాను వెనకడుగు వేయనని, తన బలాన్ని చూపించడానికి పెద్ద ఎత్తున కార్యక్రమం ప్లాన్ చేశారు. శివుని విగ్రహ ప్రతిష్టా మహోత్సవం పేరుతో భారీ స్థాయిలో సభను నిర్వహించి, అనుచరులను సమీకరించారు. ఫలితంగా ఏ వైపు నుంచి గందరగోళం తలెత్తుతుందోనన్న భయంతో పోలీసులు పెద్దారెడ్డిని ఆపేశారు. ఇక, పోలీసులే హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగుపెట్టే అవకాశం సుప్రీంకోర్టు తీర్పుపైనే ఆధారపడింది. మొత్తానికి, జేసీ బ్రదర్స్ రాజకీయ శక్తి, వారి స్కెచ్‌లు ఇప్పటికీ తాడిపత్రిలో బలంగా పనిచేస్తున్నాయి. పెద్దారెడ్డి ప్రయత్నం విఫలమైపోవడంతో, జేసీల ఆధిపత్యం మరోసారి స్పష్టమైందని చెప్పక తప్పదు.