
పోలీసులు కూడా ఈ ఇద్దరి మధ్య ఎప్పుడెప్పుడు గొడవ చెలరేగుతుందోనని టెన్షన్‌లోనే గడుపుతున్నారు. ఇక అనంతపురం అర్బన్‌లో పరిస్థితి మరోలా ఉంది. మాజీ ఉద్యోగి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గెలుపు సాధించి, తన శక్తిని నిరూపించుకున్నారు. ఆయన ప్రత్యర్థి టీడీపీ సీనియర్ నాయకుడు వైకుంఠం ప్రభాకర్ చౌదరితో ఘర్షణలు కొనసాగుతున్నాయి. వైకుంఠం వర్గాన్ని చీల్చి తన అనుచరులను ముందుకు తేవడంలో దగ్గుపాటి ఫుల్ బిజీగా ఉన్నారు. దీంతో పార్టీ లోపలే ఘర్షణలు ముదురుతున్నాయి. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదల సందర్భంగా దగ్గుపాటి చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదం అయ్యాయి. పార్టీ హైకమాండ్ కూడా దీనిపై అసహనం వ్యక్తం చేసింది. ఆగ్రహంతో జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ నేతలు 100 మందికి పైగా ఆదివారం ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు.
ఆయన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు 10 మంది నేతలను అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే మాత్రం ఆందోళన దృష్ట్యా హైదరాబాదుకు వెళ్లిపోయారు. తాడిపత్రిలో జేసీ–పెద్దారెడ్డి తగవులు, అర్బన్‌లో దగ్గుపాటి–వైకుంఠం ఘర్షణలు, పైగా జూనియర్ ఎన్టీఆర్ వివాదం కలసి అనంతపురం జిల్లాలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. కూటమి ప్రభుత్వానికి ఇది పెద్ద తలనొప్పిగా మారింది. ఏ చిన్న సంఘటన అయినా రాష్ట్రస్థాయి చర్చకు దారి తీస్తోంది. మొత్తం మీద, అనంతపురం రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ, జిల్లా వాతావరణాన్ని పెద్ద రచ్చగా మార్చేశాయి.