హైదరాబాద్ నగరానికి ఒక బీచ్ ఉంటే ఎంత బాగుండేదో అని ఎప్పటినుంచో నగర ప్రజలతో పాటు సినిమా ఇండస్ట్రీ వాళ్లూ కలగంటున్నారు. చారిత్రక కట్టడాలు, మల్టీప్లెక్సులు, ఐటి పార్కులు, షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నా… బీచ్ మాత్రం లేని లోటు ఎప్పుడూ కనిపించింది. వీకెండ్ వచ్చిందంటే చాలామంది విశాఖ, గోవా బీచ్‌లకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. సినిమాల షూటింగ్స్‌కి కూడా దర్శకులు బీచ్ సన్నివేశాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. దాంతో హైదరాబాద్ ప్రజల మనసులో “మన నగరానికి కూడా ఒక బీచ్ ఉంటే బాగుంటుంది” అన్న కోరిక సంవత్సరాలుగా ఉంది. ఇప్పటివరకు ఈ బీచ్ డ్రీమ్‌పై చాలా రాజకీయ నేతలు హామీలు ఇచ్చారు. సభల్లో, మీటింగుల్లో “హైదరాబాద్‌లో బీచ్ తీసుకొస్తాం” అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ప్రతిసారీ ప్రజలు నవ్వుకున్నారు, ప్రతిపక్షాలు సెటైర్లు పేల్చాయి. కానీ ఈసారి మాత్రం హామీ కాదు, నిజంగానే కృత్రిమ బీచ్ (Artificial Beach) ప్రాజెక్ట్‌పై తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది.


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త సంస్కరణలు మొదలుపెట్టింది. ఆ జాబితాలోనే కొత్వాల్ గూడ వద్ద కృత్రిమ బీచ్ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు 35 ఎకరాల విస్తీర్ణంలో, రూ.225 కోట్ల భారీ వ్యయంతో ఈ బీచ్‌ని నిర్మించబోతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచే ప్రాజెక్ట్ వర్క్ మొదలవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇది కేవలం ఇసుక, నీరు మాత్రమే కాదు. టూరిజం ప్రమోషన్ కోసం వేవ్ పూల్స్, ఫ్లోటింగ్ విల్లాస్, సాహస క్రీడలు, లగ్జరీ రిసార్ట్స్ అన్నీ ఉండేలా డిజైన్ చేస్తున్నారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్ట్‌ని మరింత బలంగా తీసుకెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాదు, కొన్ని అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ ప్రాజెక్ట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని సమాచారం.



హైదరాబాద్‌ని ప్రపంచ టూరిజం మ్యాప్ మీద స్పెషల్‌గా నిలబెట్టడమే ఈ బీచ్ నిర్మాణం వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఇక ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటే, సినిమా షూటింగ్స్ కోసం బీచ్ కోసం దూరప్రాంతాలకు వెళ్లే అవసరం ఉండదు. ప్రజలకు కూడా సముద్రతీరంలో ఉన్న అనుభూతి హైదరాబాద్‌ లోనే లభిస్తుంది.మొత్తానికి, ఎప్పటినుంచో కలలుగన్న “హైదరాబాద్ బీచ్” ఇప్పుడు నిజం కాబోతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే, హైదరాబాద్ నగరానికి మరింత గ్లోబల్ గుర్తింపు వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ప్రజలకూ ఎంటర్టైన్‌మెంట్, ప్రభుత్వానికీ టూరిజం రెవెన్యూ, సినిమా ఇండస్ట్రీకీ కొత్త లొకేషన్!

మరింత సమాచారం తెలుసుకోండి: