
కామారెడ్డి జిల్లాలోని గొస్కె రాజయ్య కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీల్లో రోడ్లు వరద ఉధృతికి పూర్తిగా కొట్టుకుపోయాయి. అలాగే కామారెడ్డి నుండి హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారి కల్వర్టు దెబ్బతిని రవాణా స్తంభించిపోయింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలు చూసిన ప్రజలు నిజంగా భయబ్రాంతులకు గురవుతున్నారు. ఎటు చూసినా నీరే నిండి ఉండటం, రహదారులు తెగిపోవడం వల్ల పరిస్థితి చాలా విషమంగా మారింది. మెదక్ జిల్లాలో కూడా పరిస్థితి భయంకరంగానే ఉంది. పంట పొలాలు నాశనమవ్వడంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. రోడ్లు దెబ్బతినడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. స్కూళ్లు, ఆఫీసులు, పరీక్షలు అన్నీ రద్దు చేస్తూ ప్రభుత్వం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు బయటికి రావాలని హెచ్చరించింది.
ఇక పోచారం ప్రాజెక్ట్ వరద నీటితో నిండిపోవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షం కారణంగా గ్రామాల్లోని ప్రజలు భయంతో ఉండిపోతున్నారు. మరోవైపు వాతావరణ శాఖ మరో రెండు మూడు రోజులపాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించడం ప్రజల్లో మరింత ఆందోళన పెంచింది. ఈ భారీ వర్షాల కారణంగా కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఇళ్లు, పంటలు, రోడ్లు అన్నీ దెబ్బతిన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాలకు ప్రభుత్వం సహాయం అందిస్తుందా అన్నది చూడాల్సి ఉంది. మొత్తానికి మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు ప్రజల జీవితాలను పూర్తిగా స్తంభింపజేశాయి.