ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గత రెండు రోజుల నుంచి విశాఖలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలలో మాట్లాడిన ప్రసంగాలను వింటే పవన్ కళ్యాణ్ శత్రువులు ఎవరు అనే విషయం తెలిసిపోతుంది. ముఖ్యంగా అటు ప్రతిపక్ష నాయకుడి స్థానంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన తీరు.. ఇప్పుడు అధికారంలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ కు మధ్య చాలా తేడా కనిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ 2017లో కూడా పరోక్షంగా టిడిపి పార్టీతో భాగస్వామిగా ఉన్నారు. ఆ సమయంలోనే సుగాలి ప్రీతి అత్యాచారం ఘటన జరిగింది. సీఎంగా బాబు అధికారంలో ఉన్నంతవరకు ఈ కేసు పైన పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. కానీ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కేసుని పెద్ద ఎత్తున వైరల్ చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను చూస్తే జగన్ పాలనలోనే సుగాలి ప్రీతి హత్య జరిగిందని అభిప్రాయాలు కూడా కలిగేలా చేశారు. సుగాలి ప్రీతి కేసు విషయంపై కూడా గత ప్రభుత్వం చొరవ తీసుకుంది.. అలాగే గత ప్రభుత్వంలో సుగాలి ప్రీతి కుటుంబానికి భూమి, స్థలం, నగదుతో పాటు సుగాలి ప్రీతి తండ్రికి ఉద్యోగం కూడా ఇచ్చారు.

2024 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మొదటి కేసు సుగాలి ప్రీతి కేసు చేపడతానంటూ చెప్పుకుంటూ తిరిగారు. కానీ అధికారంలోకి వచ్చిన 15 నెలలో ఏం చేశారో అందరూ చూస్తూనే ఉన్నారు.. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ  తన బిడ్డకు న్యాయం చేయలేకపోయారంటూ సుగాలి ప్రీతి తల్లి" పార్వతి" మీడియా ముఖంగా స్పందించారు. అయితే ఈ విషయం పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతులెత్తేశారని తెలుస్తోంది. కేవలం వైసీపీ పార్టీ పైన అక్కస్సుతోనే అప్పుడు ఎన్నో భారీ డైలాగులు చెప్పి మభ్యపెట్టారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేయలేదని.. అంటూ ఆయనపై ప్రజలు కూడా చాలా దారుణమైన విమర్శలు చేస్తున్నారు.

ఇక తన సొంత పార్టీ నాయకులు పదవుల విషయం పైన కూడా పవన్ కళ్యాణ్ ఆశ్చర్యపోయేలా మాట్లాడారు. పదేపదే పదవులు కావాలి అంటే..మనం వచ్చిన మూలాల్ని మర్చిపోతామంటూ మాట్లాడారు. పదవులు ఏమి ఆశించకుండానే..  కేవలం సేవ చేయాలంటూ హిత బోధ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ విషయంపై అటు సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా తీవ్రస్థాయిలో నిరాశలో ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణం పైన కూడా పలు వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. అప్పట్లో తన చొరవతోనే  ప్రైవేటీకరణం ఆగిపోయిందని.. కానీ ఇప్పుడు ప్లాంట్ ప్రైవేటీకరణం చేస్తున్నారనే గొడవ చేస్తున్న కార్మిక సంఘాల నాయకులు వైసిపి హయాంలో ఎందుకు చేయలేదంటూ ప్రశ్నించారు? ఈ విషయం పైన కార్మిక సంఘాల నాయకులు కూడా తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారు. ఈ విషయంపై అటు పవన్ కళ్యాణ్ కాకుండా కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు  ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులతో పాటుగా సంఘాల నాయకులను  కించపరిచేలా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ తెలుపుతున్నారు. అలాగే ఉద్యోగుల వీఆర్ఎస్ పైన కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు విమర్శల పాలు చేస్తున్నాయి.


2019 ఎన్నికలలో  పవన్ కళ్యాణ్.. తనను ఎమ్మెల్యేగా గాజువాక నుంచి గెలిపించినా..  స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా ఉండేవాడిని అంటూ ఉద్దేశించి మాట్లాడారు.. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ద్వంద్వ వైఖరిని చూసి ఆశ్చర్యపోతున్నారు. దీన్ని బట్టి చూస్తే.. పవన్ కళ్యాణ్ పేరు తగ్గిపోవడానికి ఆయనకు రాజకీయ శత్రువులు అవసరం లేదు..ఆ పనిని పవన్ కళ్యాణ్  స్వయంగా చేసుకున్నట్టుగా కనిపిస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: