వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారినా, వైసీపీ లోపల ఎలాంటి ఆందోళన కనిపించడం లేదు. సాధారణంగా ఒక పెద్ద పార్టీ నుంచి ముఖ్య నాయకులు వెళ్లిపోతే, ఆ పార్టీ లోపల పెద్దగా చర్చలు మొదలవుతాయి. కానీ జగన్ శైలిలో అలాంటి హడావిడి కనబడటం లేదు. దీనికి ప్రధాన కారణం ఆది నుంచే జగన్ అనుసరిస్తున్న వ్యూహమేనని అంటున్నారు. జగన్ ఎప్పుడూ "పోయేవాళ్లు పోతారు, ఉండేవాళ్లు ఉంటారు" అనే తత్వంతోనే వ్యవహరిస్తున్నారు. కృష్ణమోహన్ వంటి బలమైన నాయకులు పార్టీని వీడి వెళ్లినా, ఆళ్ల నాని లాంటి సీనియర్ నేతలు కూడా దారిమారినా, జగన్ వారిని ఆపడానికి లేదా బ్రతిమాలడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. వారికి ఫోన్ చేసి మాట్లాడలేదు, చర్చ జరపలేదు. అప్పుడు కూడా ఆయన ఒకే విధమైన ధోరణిని పాటిస్తున్నారు.


విజయసాయి రెడ్డి వంటి తన కుడిభుజం అనిపించే నాయకుడు కూడా కొంతకాలం పార్టీ నుంచి దూరంగా ఉన్నా జగన్ పెద్దగా స్పందించలేదు. చాలా రోజుల తర్వాత ఆయనపై మాట్లాడుతూ, "చంద్రబాబుకు డబ్బులు ఉన్నాయి కాబట్టి కొనేసాడు" అన్నట్లుగా మాట్లాడారు. దాంతోపాటు అంతకు మించి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో పార్టీ నుంచి ఎవరైనా వెళ్ళిపోతే పట్టించుకోవడం కంటే, ఉన్నవారితోనే ముందుకు వెళ్లడమే జగన్ పాలసీగా కనిపిస్తోంది. ప్రస్తుతం మరికొంతమంది ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారే అవకాశం ఉందన్న చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో శాసనసభలో వైసీపీ బలహీనంగా ఉన్నట్లు అనిపించకపోయినా, శాసనమండలిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. వైసీపీ ఎమ్మెల్సీలు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ బలమైన పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో టిడిపి వర్గాల్లో, "మరికొంతమంది ఎమ్మెల్సీలను మన వైపు తిప్పుకోగలిగితే మండలిలో పైచేయి సాధించవచ్చు" అన్న లెక్కలు వేస్తున్నట్లు సమాచారం.


ఈ విషయం వైసీపీ వరకు కూడా చేరిందని చెబుతున్నారు. అయినప్పటికీ జగన్ కానీ, ఇతర సీనియర్ నేతలు కానీ దీనిపై ఎలాంటి స్పందన ఇవ్వడం లేదు. ఎవరైనా పార్టీ నుంచి వెళ్లిపోతే పర్వాలేదు, ఉన్నవారితోనే ముందుకు పోతామని భావిస్తున్నారు. అయితే ఈ ధోరణి ఎక్కడికి దారితీస్తుందన్నది సమయం చెబుతుంది. మొత్తం మీద, వైసీపీ పరిస్థితి ప్రస్తుతం ఇబ్బందికర దశలో ఉందనేది వాస్తవం. జగన్ వ్యూహం కొనసాగుతుందా, లేక పరిస్థితుల ఒత్తిడికి లోనై మార్పులు వస్తాయా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: