
నటనలో వైవిధ్యం
చిరంజీవి తన కెరీర్ ప్రారంభంలోనే విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, తన సమకాలీనుల నుండి వేరుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించాడు. ముఖ్యంగా, ప్రతికూల షేడ్స్ ఉన్న పాత్రలను నిర్భయంగా ఒప్పుకుని, తన నటనా ప్రతిభను చాటుకున్నాడు. 1983లో విడుదలైన "ఖైదీ" చిత్రం అతని కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ యాక్షన్ మూవీ చిరంజీవిని మాస్ హీరోగా నిలబెట్టింది. ఆ తర్వాత, "పసివాడి ప్రాణం", రుద్ర వీణ, స్వయం కృషి, విజేత, చంటబ్బాయి, ఆపద్బాంధవుడు, కొండవీటి దొంగ, "యముడికి మొగుడు", "అత్తకు యముడు అమ్మాయికి మొగుడు", "జగదేకవీరుడు అతిలోక సుందరి", "గ్యాంగ్ లీడర్", "ఘరానా మొగుడు", "ఇంద్ర" వంటి ఇండస్ట్రీ హిట్‌లతో చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమలో "మెగాస్టార్"గా రాణించాడు. కొంత గ్యాప్ తీసుకుని తిరిగి ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీయంట్రి ఇచ్చిన ఆయన ఆ సినిమాతో ఘన విజయం అందుకుని మళ్లీ బ్లాక్ బస్టర్ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ వస్తున్నారు.
సామాజిక సేవతో
చిరంజీవి కేవలం సినిమా నటుడిగానే కాకుండా, ఒక గొప్ప మానవతావాదిగా కూడా గుర్తింపు పొందారు. ఆయన స్థాపించిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌ను నెలకొల్పి వేలాది మంది ప్రాణాలను కాపాడారు. ఆరోగ్యం, విద్య, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయం అందించడంలో చిరంజీవి ఎల్లప్పుడూ ముందుంటారంటే ఆయన సమాజ సేవకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అర్థం చేసుకోవచ్చు. సినీ కళాకారులకు సహాయం చేయడంలోనూ ఆయన తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సినీ పరిశ్రమలోనే కాదు బయట వ్యక్తులకు కూడా ఎలాంటి ఆపద వచ్చినా సహాయం చేసేందుకు ఆయన ముందుంటారు. ఆయన చేసే గుప్తదానాలకు లెక్కేలేదు.
చిరంజీవి సినిమాలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, అవి ఒక సామాజిక సందేశాన్ని కూడా అందించేలా ఉంటాయి. చిరు డ్యాన్స్, యాక్షన్ సీన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను ఎప్పటికీ ఆకర్షిస్తాయి. దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో, చిరు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించాడు. ఆయన కష్టపడే తత్వం, నిబద్ధత, ఒక స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలిపాయి.
ఈ రోజుకీ చిరంజీవి అంటేనే ఒక వైబ్రేషన్. రాబోయే సంక్రాంతికి ఆయన హీరోగా నటిస్తున్న "మన శంకర వర ప్రసాద్ గారు" సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది, అలాగే వేసవిలో "విశ్వంభర" చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా, బాబీ దర్శకత్వంలో ఒక భారీ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. చిరంజీవి, తన సినీ ప్రయాణంలో ఎప్పటిలాగే ముందుంటూ, అభిమానులకు కొత్త సినిమాలతో ఆనందాన్ని అందించడానికి రెడీగానే ఉన్నారు.