కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ప్రస్తుతం ఓ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వం తనదేనని, ఆయన సంక్షేమం,పేదల పక్షపాతం తనకూ వారసత్వంగానే ఉంటుంద‌ని ఆమె ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు. ముఖ్యంగా వైయస్ రాజకీయాల్లో రెండవసారి విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఆరోగ్యశ్రీ పథకంను తరచూ ప్రస్తావిస్తూ, అది ఆయన అత్యంత ప్రజాసంక్షేమ ఆలోచనల్లో ఒకటని ప్రాజెక్టు చేసుకున్నారు. వైఎస్ స్వయంగా కూడా “ఆరోగ్యశ్రీ లేకపోతే నేను రెండోసారి సీఎం కాలేదు” అని చెప్పిన విషయం గుర్తుచేసుకోవాలి.


వైయస్ మరణం తరువాత అనేక ప్రభుత్వాలు మారినా ఆరోగ్యశ్రీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొనసాగుతోంది. కానీ తాజాగా ఈ పథకం రెండు రాష్ట్రాల్లోనూ అటకెక్కిందన్న వార్తలు వస్తున్నాయి. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ ఆరోగ్యశ్రీని తగ్గించి, కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధానంగా అమలు చేస్తారన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయుష్మాన్ భారత్ కింద పేదలకు 25 లక్షల రూపాయల వరకు వైద్య బీమా అందుతుందని చెబుతున్నారు. దీనితో పోలిస్తే ఏపీలో ఆరోగ్యశ్రీ కింద కేవలం రెండున్నర లక్షల బీమా మాత్రమే లభిస్తోంది. దీంతో కేంద్ర పథకాన్నే ప్రాధాన్యంగా అమలు చేయడం సులభమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.


మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అక్కడ వైయస్ జయంతులు, వర్ధంతులు ఘనంగా నిర్వహిస్తూనే.. ఆరోగ్యశ్రీ పథకాన్ని మాత్రం పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం వినిపిస్తోంది. ఇప్పటికే ఆసుపత్రులకు మూడు వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఆ పథకం అస్తవ్యస్తమైందని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆర్థికభారం తగ్గించుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆయుష్మాన్ భారత్ వైపు మొగ్గు చూపుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో షర్మిల మాత్రం చిక్కుల్లో పడిపోయారు.


ఎందుకంటే ఆమె తండ్రి వారసత్వంగా చెప్పుకునే ఆరోగ్యశ్రీని రెండు రాష్ట్రాలు కూడా క్రమంగా పక్కన పెడుతున్నా, ఆమె ఇప్పటివరకు స్పందించలేకపోయారు. మాట్లాడితే తెలంగాణలో సొంత కాంగ్రెస్ ప్రభుత్వాన్నే తప్పుబట్టినట్లవుతుంది. ఏపీలో మాట్లాడితే, గత వైసీపీ పాలనలోనే రెండు వేల కోట్లకు పైగా బకాయి పెంచారని, అప్పుడు మౌనంగా ఉన్న షర్మిల ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారు అన్న ప్రశ్న ఎదురవుతుంది. అందువల్ల రెండు రాష్ట్రాల విషయాన్నీ ఒకేసారి స్పష్టంగా ప్రస్తావించలేని క్లిష్ట స్థితిలో షర్మిల చిక్కుకుపోయారు. -

మరింత సమాచారం తెలుసుకోండి: