
ప్రస్తుత ఎన్నికల వేళ, అధికారంలో కొనసాగాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి అనుసరిస్తున్న వ్యూహాలు చర్చనీయాంశమయ్యాయి. ఆందోళన కలిగిస్తున్న ప్రధాన అంశం ఏమిటంటే, హడావిడిగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల సవరణ. ఈ సవరణ ప్రక్రియ ఎన్నికల కమిషన్ (ఈసీ) స్వతంత్రతను ప్రశ్నిస్తోందనే ఆరోపణలు, పెద్దఎత్తున ఓటు చోరీ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆశ్చర్యకరంగా, ఈసీ వివరణ ఇవ్వాల్సింది పోయి, ప్రతిపక్షాలపై విమర్శలకు దిగుతోంది.
ఈ నిరసనల మధ్యే ఈసీ తుది జాబితాను, షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయితే, సుప్రీంకోర్టు ఈ వివాదంపై స్పందించింది. ఓటర్ల జాబితాలోని చేర్పులు, తొలగింపులకు సంబంధించిన పూర్తి వివరాలను క్షేత్రస్థాయి వరకు ప్రదర్శించాలని ఈసీని ఆదేశించింది. తొలగింపునకు గురైన వారి అప్పీల్ హక్కు మరియు కొత్తగా నమోదైన లక్షలాది మంది ఓటర్ల గుర్తింపుపై కూడా ప్రశ్నలు సంధించింది. తుది జాబితా ప్రకారం బీహార్‌లో 7.42 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు. ఇది అధికారిక వయోజన జనాభా (సెప్టెంబర్ నాటికి 8.22 కోట్లు) కంటే సుమారు పది శాతం తక్కువ. ఒక రాష్ట్రంలో ఇంతమంది ఓటుహక్కు కోల్పోవడం దేశ ఎన్నికల చరిత్రలోనే ఒక రికార్డు.
అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఓటు హక్కు కోల్పోయిన వారిలో ముసాయిదా జాబితాలో 25 శాతం, తుది జాబితాలో 34 శాతం మంది ముస్లింలే. మొత్తం మీద సుమారు ఆరు లక్షల మంది ముస్లింలు ఓటర్ల జాబితా నుంచి తొలగింపునకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. దీని లక్ష్యం ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే, పెద్ద సంఖ్యలో మహిళల ఓట్లు కూడా గల్లంతయ్యాయనే నివేదికలున్నాయి.
ముసాయిదా జాబితాతో పోలిస్తే తుది జాబితాలో కొత్తగా చేరిన లక్షల సంఖ్యలోని నకిలీ పేర్లు సైతం ఇప్పటికే సుప్రీంకోర్టు పరిశీలనలో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిన ఈసీ వీటిని ఏ మేరకు పాటిస్తుందో వేచి చూడాలి.