ఇటీవల కాలంలో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతూ సాధారణ ప్రజలకు దూరమవుతున్నాయి. ప్రతి రోజూ పసిడి ధరలు పెరుగుతూనే ఉండడంతో బంగారం కొనుగోలు సాధారణ మధ్యతరగతి ప్రజలకు *“దూరపు కల”*గా మారింది. మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుతాయని అనుకున్న అంచనాలు నిజం కాకుండా - ఇంకా మరింత పెరుగుతాయన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నదేమిటంటే - ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రారంభమైన బంగారం పరుగు ఎక్కడా ఆగడం లేదు. వెండి ధరలు కూడా అదే దిశలో పరుగులు పెడుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్, పండుగలు ఉన్నప్పటికీ అమ్మకాలు తగ్గిపోవడం గమనార్హం.
 

ప్రజలు కొనుగోలు చేయలేని స్థాయికి ధరలు చేరిపోవడంతో పసిడి మార్కెట్‌లో నిశ్శబ్దం నెలకొంది. బంగారం ధరలు పెరగడానికి కారణాలు .. పసిడి రేట్లు ఇలా ఆకాశాన్నంటడానికి అనేక ఆర్థిక, అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి. దేశంలో బంగారం దిగుమతులు తగ్గడం. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకులు పెరగడం. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే పడిపోవడం.అమెరికా ఆర్థిక పరిస్థితులు, ట్రంప్ విధించిన అదనపు సుంకాలు. అమెరికా షట్‌డౌన్ వంటి పరిణామాలు. ఈ అన్ని అంశాలు కలసి బంగారం ధరలను పెంచుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పెట్టుబడిదారులు కూడా ఇలాంటి పరిస్థితుల్లో కొనుగోలు చేయకుండా వెనుకడుగేస్తున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నేటి ధరలు: 22 క్యారెట్ల పది గ్రాములు: రూ.1,13,610 , 24 క్యారెట్ల పది గ్రాములు: రూ.1,23,940 , కిలో వెండి: రూ.1,70,010 . వెండి ధరలో స్వల్పంగా రూ.100 పెరుగుదల నమోదయింది.

 

బంగారం మాత్రం ప్రతిరోజూ వందల రూపాయల చొప్పున పెరుగుతూ పసిడి కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ముందు రోజుల్లో పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం షాపుల్లో బీభత్సం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. బంగారం రేట్ల పెరుగుదల వల్ల ప్రజలు కొనుగోలును వాయిదా వేస్తున్నారు. దాంతో మార్కెట్‌లో ఉత్సాహం తగ్గిపోతుంది. నిపుణుల అంచనాల ప్రకారం - రాబోయే వారాల్లో కూడా బంగారం ధరలు తగ్గే సూచనలు లేవు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు అలాగే కొనసాగితే పసిడి రేట్లు మరింత ఎగబాకే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు మార్కెట్ ట్రెండ్‌ను గమనించి, సరిగ్గా సమయం చూసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: