మాగంటి గోపీనాథ్ – ఈ పేరు ఇప్పుడు రాజకీయ వేదికపై ఓ కన్నీటి బొమ్మ. ఆయన నిండు నూరేళ్లు జీవించకపోయినా, ఒక గౌరవప్రదమైన కుటుంబ పెద్దగా, ప్రజా సేవకుడిగా తన జీవితాన్ని గడిపారు. ఆయన జీవించి ఉన్నంత వరకు, ఆయన వ్యక్తిగత జీవితంపై ఎలాంటి మచ్చా, చర్చా లేకుండా గోప్యంగా, గౌరవంగా సాగింది. కానీ దురదృష్టవశాత్తూ, ఆయన అకాల మరణం తర్వాత, ఆయన కుటుంబం ఇప్పుడు రాజకీయ బలిపీఠం పైకి ఎక్కించబడింది. తెరచాటు వ్యవహారాలన్నీ ఇప్పుడు బహిరంగ వీధుల్లో చర్చనీయాంశమవుతున్నాయి. తల్లి ఫిర్యాదు వెనుక రాజకీయ డ్రామా? .. గోపీనాథ్ మరణించి దాదాపు ఆరు నెలలు కావస్తున్నా, ఆయన తల్లికి ఇప్పుడే న్యాయం గుర్తుకు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది.
 

సుదీర్ఘ అనారోగ్యంతో బాధపడి గోపీనాథ్ కన్నుమూశారన్న విషయం ఆ తల్లికి తెలియదా? తెలిసీ కూడా, ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడేవరకూ మౌనంగా ఉండి, ఇప్పుడు హఠాత్తుగా 'మరణంపై దర్యాప్తు' చేయాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం కేవలం రాజకీయ అస్త్రం మాత్రమేనని రాజకీయ విశ్లేషకులకు సులువుగా అర్థమవుతోంది. ఇది సంతాపానికి సంబంధించిన విషయం కాదు, సానుభూతిని ఓట్లుగా మార్చుకునే ప్రయత్నం. రెండు కుటుంబాల వివాదం: లీగల్ vs లవ్! .. గోపీనాథ్ మరణంతో వెలుగులోకి వచ్చిన మరో సంచలన విషయం – మొదటి భార్య వ్యవహారం. ఆయన బతికి ఉన్నప్పుడు, చనిపోయిన తర్వాత కూడా తెరవెనుక ఉన్న ఈ బంధం, ఇప్పుడు హఠాత్తుగా తెరపైకి రావడం వెనుక బలమైన రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనడంలో సందేహం లేదు.  'ప్రద్యుమ్న తారక్' అనే యువకుడు తన తల్లే గోపీనాథ్ లీగల్ వైఫ్ అని, తానే లీగల్ వారసుడు అని వాదిస్తున్నారు. కానీ వాస్తవం ఏమిటి? గోపీనాథ్ దాదాపు మూడు దశాబ్దాల క్రితమే మాగంటి సునీతను వివాహం చేసుకున్నారు.



ఇక వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. సంవత్సరాల తరబడి ఆయనతో కలిసే జీవించారు. ఒకవేళ మొదటి వివాహం చట్టబద్ధమైతే, ఇన్ని సంవత్సరాలు ఎందుకు మౌనంగా ఉన్నారు? పెద్దమనుషుల పంచాయతీతో దూరం జరిగిన బంధాన్ని, ఇప్పుడు లీగల్ పత్రాల మాటున వివాదాస్పదం చేయడం వెనుక ఆస్తిపై ఆశ తప్ప మరో కారణం కనిపించడం లేదు. ఆస్తుల కోసం ఆశ పెట్టారా? .. గోపీనాథ్‌కు ఉన్న ఆస్తులపై లీగల్ వారసత్వం పేరు చెప్పి, ఆశలు కల్పించి, ఎప్పుడో దూరమైన కుటుంబాన్ని రంగంలోకి దించారన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. మాగంటి సునీత మరియు ఆమె పిల్లలకు అన్యాయం చేసి, వారికి దక్కాల్సిన ఆస్తులను లాగేసుకోవాలనే దురుద్దేశంతోనే ఈ రాజకీయ కుట్ర నడుస్తోందని స్పష్టమవుతోంది. ఏది ఏమైనా... ఈ రోజు రాజకీయ పార్టీల పావులుగా మారిన ఈ కుటుంబ సభ్యులను, ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరూ పట్టించుకోరు. అప్పుడే తాము చేసిన తప్పు, తాము భాగమైన కుట్ర వారికి తెలిసివస్తుంది. ఓట్ల కోసం బజారున పడ్డ ఒక నిండు కుటుంబాన్ని చూసి సమాజం సానుభూతి చెందడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: