- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి - ఇండియా హెరాల్డ్ ) . . .

తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన జూబ్లిహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగిసింది. ఈ ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి ఇది ప్రతిష్టాత్మక పోరు కాగా, ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు తమ రాజకీయ ఉనికిని నిరూపించుకునే యత్నంలో ఉన్నాయి. ఈ ఎన్నికలో కేసీఆర్ మినహా అన్ని అగ్ర నాయకులు బరిలోకి దిగి తీవ్ర ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ సమన్వయకర్తగా ప్రచారాన్ని నడిపించగా, కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ముందుండి ప్రచారం చేపట్టారు. బీజేపీ తరఫున కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు పలు సభల్లో పాల్గొని పార్టీ అభ్యర్థికి మద్దతు కోరారు.


ఈ ఎన్నికల ప్రత్యేకత ఏమిటంటే ఓటర్ల ముందుంచిన స్పష్టమైన అజెండా ఏ పార్టీదీ కాదన్నది. ప్రజలకు అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారం వంటి అంశాలపై స్పష్టమైన దిశా నిర్దేశం కనిపించలేదు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేక భావనను సృష్టించేందుకు బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నించింది. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ప్రచారాల ద్వారా భారీ స్థాయిలో ఖర్చు పెట్టింది. ఆ పార్టీకి ఈ గెలుపు అత్యవసరంగా మారింది, ఎందుకంటే హైదరాబాదులో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కేటీఆర్ లక్ష్యం. గ‌త ఎన్నిక‌ల్లో ఓడినా గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో బీఆర్ఎస్ పూర్తి ఆధిప‌త్యం చాటుకుంది.


ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే, పార్టీ అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ, ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగడం ద్వారా ప్రచారానికి దూకుడు తెచ్చారు. అభ్యర్థి నవీన్ యాదవ్ తన గెలుపు కోసం తాను చేయగలిగినంత కృషి చేస్తున్నారు. మరోవైపు బీజేపీ పరిస్థితి బలహీనంగా ఉండటంతో ఇతర పార్టీలు “ డిపాజిట్ కూడా రాదు ” అంటూ ఎద్దేవా చేస్తున్నాయి. ఇక గెలుపు విషయంలో పోల్ మేనేజ్‌మెంట్ కీలకం కానుంది. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించడం, బూత్ స్థాయి సమన్వయం వంటి అంశాలపై ప్రతి పార్టీ దృష్టి సారిస్తోంది. ప్ర‌చారం ఎలాగూ హోరాహోరీగా సాగింది. పోల్ మేనేజ్‌మెంట్‌లో స‌క్సెస్ అయిన వారే విజేత కానున్నారు. ప్రచారం ముగిసినా, పోలింగ్ జరిగే రోజువరకు జూబ్లిహిల్స్ రాజకీయంగా కదలికలతో కిక్కిరిసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: