అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. ఆయన 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తి గ్రామంలో జన్మించారు. పేద కుటుంబంలో జన్మించిన అందెశ్రీ చిన్న వయసులోనే కష్టసుఖాలు అనుభవించారు. మొదట గొర్రెల కాపరిగా, ఆ తరువాత భవన నిర్మాణ కార్మికుడిగా జీవనం కొనసాగించారు. పాఠశాల విద్య పెద్దగా అందకపోయినా, తనలోని సహజ ప్రతిభ, సృజనాత్మకతతో కవితా ప్రపంచంలో అడుగుపెట్టారు. విద్య లేకపోయినా, ఆయన పద్యం ప్రజల మనసులను తాకే శక్తి కలిగినదిగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి దారితీసిన ఉద్యమ సమయంలో అందెశ్రీ పాటలు, కవితలు, ప్రసంగాలు ప్రజల్లో నూతన చైతన్యాన్ని నింపాయి. ఆయన రాసిన పాటలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే విధంగా ఉండేవి. ముఖ్యంగా "మాయమైపోతున్న డమ్మా మనిషన్న వాడు" అనే గీతం ద్వారా ఆయనకు విపరీతమైన ఖ్యాతి లభించింది. తెలంగాణ ఉద్యమంలో ఆయన కవితలు ఒక ఆత్మవిశ్వాస నినాదంలా మారి, ప్రతి గ్రామంలో ప్రతిధ్వనించాయి.
సాహిత్యంలో తన కృషిని గుర్తించి కాకతీయ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. 2006లో విడుదలైన ‘గంగ’ సినిమాకు ఆయన రాసిన సాహిత్యం కోసం నంది పురస్కారం అందుకున్నారు. ఆయన రాసిన కవితలు, పాటలు కేవలం సాహిత్య సౌందర్యంతోనే కాకుండా, సామాజిక చైతన్యంతో కూడినవిగా నిలిచాయి. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఆయన సాహిత్య సేవలను గౌరవిస్తూ రూ. కోటి నగదు పురస్కారంను ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, “నా కవిత్వం తెలంగాణ మట్టికి అంకితం. నా పదాలు ఈ నేల మనిషి ఊపిరిలా ఉన్నాయి” అని చెప్పిన మాటలు ఇప్పుడు అభిమానులను కన్నీటి పర్యంతం చేస్తున్నాయి.
అందెశ్రీకి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన మరణం పట్ల రాష్ట్ర సాహితీ వర్గాలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి, పలువురు కవులు ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. సాహిత్యాన్ని ఆయుధంగా మార్చి సమాజానికి మార్గదర్శకుడైన అందెశ్రీ ఇక లేరన్న నిజం తెలంగాణ ప్రజలకు భరించరాని లోటుగా మిగిలింది. ప్రజల జీవితాన్ని, వారి బాధలను, వారి ఆశలను తన పద్యాల్లో ప్రతిబింబించిన అందెశ్రీ తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సాహితీ లోకం ప్రార్థిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి