చుట్టూ పచ్చని అడవి, పక్కనే నడుస్తున్న చల్లని సెలయేరు, ఓ బండరాయిపై కూర్చొని చేతిలో పుస్తకంతో గంభీరంగా చదువుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో ఆయన చదువుతున్న పుస్తకం ఏమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి అభిమానుల్లో, జనసైనికుల్లో ఊపందుకుంది. కొందరు జూమ్ చేసి చూసి ఆ పుస్తకం పేరు “ Man-Eaters and Jungle Killers ” అని గుర్తించారు. ఆ తరువాత గూగుల్‌లో వెతికి చూశాక అది ప్రసిద్ధ రచయిత కెన్నెత్ ఆండర్సన్ రాసిన అడవి సాహసాల పుస్తకం అని తెలిసింది. కెన్నెత్ ఆండర్సన్ (1910–1974) భారతదేశానికి చెందిన స్కాట్లాండ్ సంతతికి చెందిన వేటగాడు, రచయిత. ఆయన బెంగళూరులో నివసిస్తూ, దక్షిణ భారత అరణ్యాలను తన జీవితంలో భాగం చేసుకున్నాడు. వన్యప్రాణులతో చేసిన అనుభవాలను ఆయన తన రచనల్లో ఉత్కంఠభరితంగా వివరించాడు. ముఖ్యంగా మనుషులపై దాడి చేసే పులులు, చిరుతపులులు, అడవి జంతువుల కథలు ఆయన రచనల్లో ప్రధానాంశం.


“Man-Eaters and Jungle Killers” పుస్తకంలో, ఒక వేటగాడు మనుషుల ప్రాణాలను తీస్తున్న మృగాలను నిర్మూలించేందుకు ఎలాంటి సవాల్ ? స్వీకరించాడు, అడవి గర్భంలో ఎదురైన ప్రమాదాలను ఎలా ఎదుర్కొన్నాడు అనే విషయాలను చాలా నిజాయితీగా, ఉత్కంఠభరితంగా వివరించాడు. ప్రతి కథలో భయం, ధైర్యం, ప్రకృతితో మనిషి సంబంధం ప్రతిబింబిస్తాయి. పవన్ కళ్యాణ్‌కు సహజంగానే పుస్తకాలంటే మక్కువ ఎక్కువ. రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా, ఆలోచనాపరుడిగా కూడా ప‌వ‌న్ స్పెషాలిటీని నిల‌బెట్టాయి.  ఈ పఠన అలవాటు. పుస్తకాల ద్వారా కొత్త ఆలోచనలు, ప్రపంచ దృక్కోణం త‌న‌కు వ‌చ్చింద‌ని ప‌వ‌న్ ప‌దే ప‌దే చెప్పిన సంగ‌తి తెలిసిందే.


ఈ ఏడాది విజయవాడలో జరిగిన 35వ పుస్తక మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, పుస్తకాల పట్ల ప్రజల్లో ఆసక్తి పెంచాలంటూ పిలుపునిచ్చారు. ఇటీవల ఆయన లక్ష్మీ ముర్దేశ్వర్ పురి రచించిన “ఆమె సూర్యుడిని కబళించింది” (She Stole the Sun) పుస్తకాన్ని ఆవిష్కరించి, మహిళా శక్తి , సమాజ మార్పుపై ఆలోచనాత్మక ప్రసంగం చేశారు. అనేక సార్లు ఆయన తన ప్రసంగాల్లో కూడా వివిధ రచయితల వాక్యాలను ఉదహరిస్తూ, సాహిత్యాన్ని రాజకీయ చర్చల్లో కలిపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అడవి నేపథ్యంలో కెన్నెత్ ఆండర్సన్ పుస్తకాన్ని చదువుతున్న పవన్ ఫొటో చూసి అభిమానులు మళ్లీ ఒకసారి ఆయన ఆలోచనాత్మక వైఖరిపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. సాధారణ రాజకీయ నాయకుడిలా కాకుండా, చదువుతో, ఆలోచనతో ముందుకు సాగే నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ మరింత బలపడింది. ఈ ఫొటో ఒక పుస్తకం పట్ల ఆసక్తిని మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంలోని లోతైన వైపును కూడా బయటపెట్టింద‌న్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: