గత సాధార‌ణ‌ ఎన్నికల తరువాత వైసీపీకి రాష్ట్రవ్యాప్తంగా ఎదురైన షాక్‌ తాలూకు ప్రభావం నుంచి ఆ పార్టీ నాయ‌కులు ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేద‌నే చెప్పాలి. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి ఉన్న బలమైన కేడర్, నాయకత్వం ఒక్కసారిగా వాయిస్‌లెస్‌ అయిపోయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతాల్లో ఆ పార్టీకి తిరుగులేన‌ట్టుగా ఉండేది. స్థానిక నాయకుల ప్రభావం, క్రమశిక్షణతో కూడిన కేడర్‌ వల్ల పార్టీ పనులు చురుకుగా సాగేవి. కానీ 2024 ఎన్నికల ఘోర పరాభవం తర్వాత ఆ ఉత్సాహం ఒక్కసారిగా ఆగిపోయింది. వైసీపీకి తిరుగులేని కంచుకోట అయిన ప‌ల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం ఉదాహరణగా తీసుకుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెండు ద‌శాబ్దాల పాటు హ‌వా చెలాయించారు. పిన్మెల్లి సోదరులు గీసిన గీత దాటడానికి అధికారులు కూడా వెనుకడుగు వేసేవారని అప్పట్లో చెప్పుకునేవారు. టీడీపీ శ్రేణులు ఆ హవాకు భయపడి ప్రాంతం వదిలి వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు పిన్నెల్లి సోదరులు కేసుల ఊబిలో చిక్కుకోవడంతో వారి హవా పూర్తిగా కరుగిపోయింది. అక్కడ వైసీపీ శబ్దమే వినిపించట్లేదు.


లోకేష్ ప్రాథినిత్యం వ‌హిస్తోన్న మంగళ‌గిరి పరిస్థితి కూడా అంతే. ఒకప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి దూకుడుతో ఈ నియోజకవర్గం వైసీపీ కోటగా మారింది. టీడీపీకి అక్కడ పెద్దగా ఆధారం లేకపోవడంతో వైసీపీ బలపడింది. కానీ ఎన్నికలకు ముందు పార్టీ చేసిన అంతర్గత మార్పులు, వ్యూహపరమైన తప్పిదాల వల్ల ఇప్పుడు మంగళ‌గిరిలో వైసీపీ జాడ కనిపించని స్థితి ఏర్పడింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజకీయంగా ఏం చేస్తున్నారో కూడా ప్రజలకు తెలియని పరిస్థితి. చంద్రగిరి కూడా ఒకప్పుడు వైసీపీ బలమైన కోటే. చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి రాజకీయ దూకుడుతో దాదాపు దశాబ్దం పాటు పార్టీ జెండా రెపరెపలాడింది. కానీ అక్రమ మద్యం వ్యవహారంలో చిక్కుకోవడం, స్థానికంగా టీడీపీ పుంజుకోవడం వల్ల వైసీపీ రోజురోజుకు బ‌ల‌హీన‌ప‌డుతోంది.


ఇదే పరిస్థితి గుడివాడలోనూ కనిపిస్తోంది. దాదాపు 25 సంవత్సరాలు కొడాలి నాని ఆధిపత్యం కొనసాగించినా, ఇప్పుడు ఆయన ఊసే లేదు. ఒక్క ఓట‌మితో గుడివాడ‌లో వైసీపీ పార్టీతో పాటు కొడాలి టీం పూర్తిగా డీలా ప‌డిన ప‌రిస్థితి. ఇక మ‌రో కీల‌క నియోజ‌క‌వ‌ర్గం గన్నవరం లో కూడా పార్టీ కార్యకలాపాలు నిష్క్రియంగా మారాయి. ఈ నేపథ్యంలో దాదాపు 30 నియోజకవర్గాల్లో వైసీపీ వాయిస్ పూర్తిగా కొలాప్స్ అయిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీకి ఇప్పటికీ పునరుత్తేజం అవసరం. స్థానిక నాయకత్వాన్ని మళ్లీ బలపరచకపోతే, ఈ ప్రాంతాలు తిరిగి కూటమి పార్టీలు బ‌లంగా పుంజుకుంటాయ‌న్న‌ది విశ్లేష‌కుల అంచ‌నా.

మరింత సమాచారం తెలుసుకోండి: