ఈ తీవ్ర పోరాటంలో ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ నాయకులు, కార్యకర్తలు భారీగా డబ్బులు ఖర్చు పెట్టారనే వార్తలు ఇప్పటికే బయటకొచ్చాయి. అయితే ఇది సాధారణ ఎన్నికల్లో జరిగే అంశం కదా అని చాలామంది నిర్లక్ష్యంగా తీసుకున్నారు. కానీ ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. అసలు కథ ఇప్పుడు మొదలైంది. ఎన్నికల రోజున ఓటు వేసేందుకు డబ్బు తీసుకున్న కొందరు ఓటర్లు ఓటేయకపోవడంతో ఇప్పుడు వారిపై ఆయా పార్టీల నేతలు, బూత్ కమిటీ సభ్యులు ఒత్తిడి పెంచుతున్నారట. “మేము ఇచ్చిన డబ్బుకు ఓటేయలేదంటే, ఆ నోట్లను తిరిగి ఇవ్వాలి” అంటూ పలు ప్రాంతాల్లో నేరుగా ఇంటింటికీ వెళ్లి డబ్బు వసూలు చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.బస్తీలు, కాలనీలు, అపార్ట్‌మెంట్ లలో నేతల తరఫున పనిచేసిన బూత్ కమిటీ సభ్యులు ఇప్పుడు ఓటర్లను నిలదీస్తున్నారు. పోలింగ్ పూర్తయిన వెంటనే వారు తమ ఏజెంట్ల వద్ద ఉన్న ఓటర్ లిస్టులను చెక్ చేస్తూ, ఎవరు ఓటేశారు, ఎవరు వేయలేదు అనే వివరాలను జాగ్రత్తగా గుర్తించారు. ఓటు వేయని కుటుంబాల జాబితాను సిద్ధం చేసి, వారిని సంప్రదించడం మొదలుపెట్టారు.
కొన్ని ప్రాంతాల్లో బస్తీ పెద్దలు, కాలనీ ప్రతినిధులు కూడా ఇందులో జోక్యం చేసుకుని ఆసక్తికర నిర్ణయాలు తీసుకుంటున్నారు. “ఎవరైనా ఓటేయకపోయి డబ్బు తీసుకున్నవారు ఉంటే, వారు ఆ డబ్బును తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే ఆ మొత్తాన్ని బస్తీ అవసరాల కోసం, కాలనీ అభివృద్ధి పనుల కోసం వినియోగిస్తాం” అని నిర్ణయించుకున్నారు. ప్రతీ బూత్‌లో సగటున 50 శాతం కంటే ఎక్కువ నగదు పంపిణీ జరిగినట్లు సమాచారం. ఆ డబ్బులు ముందుగా బూత్ కమిటీ సభ్యుల ద్వారా పార్టీ కార్యకర్తల కుటుంబాలకు, బంధువులకు, స్నేహితులకు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఒక ప్రాంతంలోనే ఓ ఇంటికి సంబంధించిన 18 ఓట్ల కోసం రూ.45 వేల వరకు డబ్బు ఇచ్చారట. అయితే చివరికి ఆ ఇంటి నుంచి కేవలం నాలుగు ఓట్లు మాత్రమే పోలైనట్లు గుర్తించడంతో బూత్ కమిటీ సభ్యులు ఆరా తీశారు. విషయం సంబంధిత బస్తీ ముఖ్యుడికి చెప్పగా, ఆయన స్వయంగా ఆ ఇంటికెళ్లి “డబ్బులు తిరిగి ఇవ్వాలి లేదా బస్తీ పనులకు వినియోగించాలి” అని సూచించినట్లు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి