దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన పేలుళ్ల ఘటన దర్యాప్తు సంస్థలను కూడా తీవ్ర ఆందోళనకు గురి చేసింది. విద్యావంతులు, ముఖ్యంగా వైద్యులు వంటి ఉన్నత స్థాయి వృత్తి నిపుణులు ఉగ్రవాద కార్యకలాపాల వైపు మొగ్గు చూపుతున్న వైనం దర్యాప్తు అధికారులను కలవరపరుస్తోంది. ఫరీదాబాద్ ఉగ్రకుట్ర భగ్నం తర్వాత కేవలం కొన్ని రోజులకే ఢిల్లీ ఎర్రకోట సమీపంలో ఘోరమైన పేలుడు సంభవించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఫరీదాబాద్ ఘటనలో అరెస్టయిన ఉగ్రవాదుల విచారణలో బయటపడిన వివరాల ప్రకారం, అక్కడి ఘటన తరువాత డా. ఉమర్ అనే వైద్యుడు అప్రమత్తమై ఢిల్లీలో ఆత్మాహుతి దాడికి దిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ దాడిలో అతను ఉపయోగించిన కారు బ్లాస్ట్ కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు.


ఇక ఫరీదాబాద్ కేసులో పట్టుబడ్డ మరో నిందితురాలు డా. షాహీన్ సయీద్ ప్రస్తుతం దర్యాప్తు సంస్థల కస్టడీలో ఉంది. ఆమె యూపీ వాస్తవ్యురాలు. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం అందించడం, నిధుల సేకరణలో కీలక పాత్ర పోషించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం, డా. షాహీన్‌కు ఆత్మాహుతి దాడి చేసిన ఉమర్‌తో పాటు, ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో ప్రధాన నిందితుడైన ముజమ్మిల్‌తో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. దర్యాప్తు ప్రకారం, పాక్‌కు చెందిన జైష్-ఏ-మహమ్మద్ ఉగ్ర సంస్థ భారత మహిళల్లో మతోన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు రహస్య ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ ప్రయత్నాల ప్రభావంతోనే డా. షాహీన్ అతివాద సిద్ధాంతాల వైపు మళ్లినట్లు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా, ఇతర మహిళలను కూడా తమ ఉగ్ర కార్యకలాపాల్లో భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో ఆమె ప్రలోభపెట్టినట్లు సమాచారం.



ఉగ్ర కార్యకలాపాలకు అవసరమైన నిధుల కోసం నిందితులు దాదాపు రూ.45 లక్షలు సేకరించినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తాన్ని సేకరించడంలో డా. షాహీన్ కీలక పాత్ర పోషించిందని తెలుస్తోంది. వైద్యురాలిగా ఆమెకు ఉన్న ప్రతిష్ట, సమాజంలో ఉన్న పరిచయాలను ఉపయోగించి నిధుల సేకరణను  నిర్వర్తించినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఇక అల్‌ఫలాలా నెట్వర్క్‌ అనే అంతర్జాతీయ మత సంస్థతో డా. షాహీన్‌కు ఉన్న అనుబంధంపై కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ నెట్వర్క్‌ ద్వారా దేశీయంగా ఉగ్రవాద ఆలోచనలను వ్యాప్తి చేయడమే కాకుండా, విదేశాల నుండి ఆర్థిక సహాయం పొందిన అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: