జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ మెజారిటీ దక్కించుకుని విజయం సాధించిన నవీన్ యాదవ్‌కు ఇప్పుడు రేవంత్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా చోటు దక్కనుందా ? ఆ దిశగానే రేవంత్ ఆలోచన చేస్తున్నారా ? అంటే అవుననే ఆన్సర్లే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జూబ్లిహిల్స్ బై పోల్ లో గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి కి క్రేజ్ అమాంతం పెరిగింది. అటు అధిష్టానం దగ్గర కూడా మంచి మార్కులే పడ్డాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ , రేవంత్ ముందు నుంచి బీసీ అస్త్రం ఎక్కువుగా తెరమీదకు తీసుకు వస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ లో బలమైన బీసీ వర్గానికి చెందిన యాదవ కులానికి చెందిన నాయకుడిగా ఉన్న నవీన్ యాదవ్‌కు మంత్రి పదవి ఇవ్వాలన్నదే రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది. పైగా గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ వీక్ గా ఉంది. సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పుడు జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీ విజయం సాధించింది.
గ్రేటర్ పరిధిలో నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఒక్క మంత్రి కూడా లేరు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికకు ముందే మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీ గా ఉన్న మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చారు. ఇక ఇప్పుడు బీసీ కోటాలో యువకుడు అయిన నవీన్ యాదవ్ కు కూడా మంత్రి పదవి ఇస్తే పార్టీ సంస్థాగతంగా మరింత బలంగా ఉంటుందని రేవంత్ లెక్కలు వేస్తున్నట్టు గా తెలుస్తోంది. పైగా యువకుడు .. బీసీ అయిన నవీన్ యాదవ్‌కు మంత్రి పదవి ఇస్తే గ్రేటర్ లో పార్టీకి కొన్నేళ్ల పాటు తిరుగు ఉండదని కూడా రేవంత్ భావిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి.
నవీన్ యాదవ్ కు మంత్రి పదవి ఇస్తే... బీసీ సామాజిక వర్గంలో కాంగ్రెస్‌కు ఉన్న సానుభూతిని పెంచు తుందన్న ఆలోచన కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు తెలిసింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చే వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ప్రస్తుతం మంత్రి వర్గంలో ఉన్న రెండు సీట్లలో ఒకటి నవీన్ తో భర్తీ చేస్తే లోకల్ బాడీ తో పాటు వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ తమకు ప్లస్ అవుతుందని రేవంత్ భావిస్తున్నాడట. దీనిపై సోమవారం నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి