భగవాన్ సత్యసాయి బాబా ‘మానవ సేవయే మాధవ సేవ’ అని చెపుతూ ‘అందర్నీ ప్రేమించు అందరిలో భగవంతుడు’ ని చూడు అన్న తత్వాన్ని తన ఉపన్యాసాలలో నిరంతరం ప్రభోధిస్తూ మన మధ్య నడయాడిన అవతార మూర్తి. ఆయన స్థాపించిన సత్యసాయి సేవాసమితి ఆర్తులకు అన్నం పెట్టడం దాహం తీర్చడం వైద్యం చేయడం పిల్లలకు చదువు చెప్పడం అన్న నాలుగు స్తంభాల పై ఆసంస్థ కార్యకలాపాలు విస్తరించి మనదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలో అనేక సేవాకార్యక్రమాలు నిర్వర్తిస్తూ కొనసాగుతూ ఉండటం వల్ల సత్యసాయి బాబా మన మధ్య లేకపోయినా ఆయన సేవాకార్యక్రమాల ద్వారా అనునిత్యం చిరంజీవిగా కొనసాగుతూనే ఉన్నారు.
మనిషి వికాశానికి శాస్త్ర విజ్ఞానంతో పాటు దైవం పై విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే ‘మనిషి మనిషిగా’ జీవించగలుగుతాడు అన్న అభిప్రాయం బాబా గారిది. బాబా గారి ఉపన్యాసాలలో చెప్పిన మాటలు సూటిగా మన మనసును తాకుతాయి. మనం ప్రేమగా స్వామి లేదా బాబా అని పిలుచుకునే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 100 వ పుట్టినరోజు నేడు. ఈ పుట్టినరోజు వేడుకల ఆనందంతో పుట్టపర్తి మారుమ్రోగి పోతోంది.
బాబా ప్రేమకు ప్రతిరూపం. ఆయనను జీవించి ఉన్న కాలంలో చూసిన ప్రతి భక్తుడుకి వెయ్యి మంది తల్లుల ప్రేమ కనిపిస్తుంది. ఆయన దైవత్వాన్ని తెలుసుకున్న వారి కళ్ళలో తప్పనిసరిగా కన్నీళ్లు వచ్చి తీరుతాయి. అందరినీ ప్రేమించు - అందరికీ సేవ చేయి అన్న వేదాల సారంశం ఆయన జీవితంలో కనిపిస్తుంది.
బాబాను ఎవరో ఒకసారి "నువ్వు దేవుడివా?" అని అడిగారట. దానికి బాబా సమాధానం యిస్తూ "అవును, నేను దేవుడే. నువ్వు కూడా అంతే. తేడా ఏమిటంటే నాకు తెలుసు, నీకు తెలియదు!" అంటూ నవ్వారట. ప్రతి మనిషిలోనూ ఉండే దైవత్వాన్ని గుర్తించగలిగితే ప్రతి వ్యక్తి దైవసమానుడు అని బాబాగారి నమ్మకం. మోక్షం అంటే మోహ+క్షయం అంటే అన్ని కోరికలు మరియు అనుబంధాల నుండి విముక్తి పొందగలిగినప్పుడే ప్రతివ్యక్తి తన బాధల నుండి విముక్తి పొందుతాడు అని బాబాగారి అభిప్రాయం. ఆనందం డబ్బులో లేదు మన ఆలోచనలలో మాత్రమే ఆనందం ఉంటుంది అంటూ భగవంతుడుని కానుకలలో కాకుండా భక్తితో కొనడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే మనకు నిజమైన అనుగ్రహం లభిస్తుంది అంటూ బాబాగారు చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సత్యసాయి దేవుడు అని నమ్మేవారు ఎంతమంది ఉంటారో ఆయన దేవుడు కాదని వాదించేవారు ఎందరో ఉన్నారు. ఏది ఎలా ఉన్న అందరు ఆయన లోని మానవతా మూర్తిని గుర్తించి తీరతారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి