ఒకప్పుడు పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు ప్రాధాన్యం ఇస్తారనే విమర్శలు ఎదుర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... ఇప్పుడు ఆ పంధాను మార్చారు. అన్నదాతలను మచ్చిక చేసుకునేందుకు, వారి కష్టాలను తీర్చేందుకు సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా... నవంబర్ 24వ తేదీ నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా "రైతన్నా.. మీ కోసం" అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాంకేతికతతో సాగులో విప్లవం ..సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి, రైతులు నష్టాల పాలవుతున్న ప్రస్తుత పరిస్థితులకు అడ్డుకట్ట వేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇందులో భాగంగా, అధునాతన సాంకేతికతను (అగ్రిటెక్) వ్యవసాయానికి అనుసంధానించాలని యోచిస్తున్నారు. డ్రోన్‌లు, సెల్‌ఫోన్, శాటిలైట్ వ్యవస్థలను వినియోగించి, ఎక్కడ పురుగు ఉంటే అక్కడ మాత్రమే మందు కొట్టే స్థాయికి టెక్నాలజీని తీసుకురావాలనేది ఆయన లక్ష్యం. రైతులు ఇకపై సాంకేతికతకు దూరంగా ఉండరాదని, ఆధునిక సాగు పద్ధతులను అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ‘పంచ సూత్రాలు’ : వ్యవసాయ రంగం వృద్ధి రేటును ఏటా 15% సాధించేందుకు, 2047 నాటికి రైతుల తలసరి ఆదాయాన్ని భారీగా పెంచేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఐదు కీలక సూత్రాలను (పంచసూత్రాలు) అమలు చేస్తోంది:

1. నీటి భద్రత: నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకు నీరు అందించడం.

2. డిమాండ్ ఆధారిత పంటలు: మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా అధిక ఆదాయం ఇచ్చే పంటల సాగు.

3. అగ్రిటెక్: ఆధునిక టెక్నాలజీ (డ్రోన్‌లు) వినియోగం.

4. ఫుడ్ ప్రాసెసింగ్ విస్తరణ: పంటలకు విలువను జోడించేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు.

5. ప్రభుత్వ మద్దతు: అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద ఆర్థిక సాయం.

ఇప్పటికే ఈ పథకాల ద్వారా దాదాపు 46.85 లక్షల మంది రైతులకు రూ.14,000 చొప్పున పెట్టుబడి సాయం అందింది.

ఇంటింటికీ ప్రజాప్రతినిధులు..  'రైతన్నా.. మీ కోసం' కార్యక్రమంలో భాగంగా, ఎమ్మెల్యేలు, మంత్రులు మరియు ఉన్నతాధికారులు నవంబర్ 24 నుంచి 29 వరకు నేరుగా అన్నదాతల ఇళ్ల వద్దకే వెళ్లనున్నారు. రైతుల సమస్యలు వినడం, కొత్త సాగు విధానాలపై అవగాహన కల్పించడం, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం (నేచర్ ఫార్మింగ్) ప్రాధాన్యం గురించి వివరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ పర్యటనలు, అవగాహన కార్యక్రమాల ద్వారా... గత పాలకుల హయాంలో ఏర్పడిన రైతు-పాలకవర్గం మధ్య గ్యాప్‌ను తగ్గించేందుకు చంద్రబాబు పక్కా వ్యూహాన్ని సిద్ధం చేశారు. తనను తాను రైతు బాంధవుడిగా నిరూపించుకునేందుకు ఈ కార్యక్రమం చంద్రబాబుకు ఒక కీలకమైన వేదిక కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: