- ( నెల్లూరు - ఇండియా హెరాల్డ్ )

నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా స్థానిక నాయకత్వ మార్పు దిశగా టీడీపీ శ్రేణులు భారీగా కసరత్తు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ స్థానికంగా శక్తివంతంగా తిరిగి ఎదగాలనే సంకల్పంతో పని చేస్తుండగా… వైసీపీ చాలా సైలెంట్‌గా ఉంటోంది. సాధారణంగా ఏ పార్టీ అయినా చిన్న మార్పు వచ్చినా వెంటనే రియాక్ట్ అయ్యి త‌మ ప్రాభ‌వం చాటుకుంటుంది. కానీ నెల్లూరులో వైసీపీ నుంచి అలాంటి కదలికలు కనిపించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరును వైసీపీ పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంది. బలమైన టీడీపీ బేస్‌ను అణచివేసి, అప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరియు ఆయన కుటుంబ సభ్యులు నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్‌ను వైసీపీ ఖాతాలో పడేలా కీలకంగా పనిచేశారు. వారి వ్యూహాలతో టీడీపీ అక్కడ గట్టిగా నిలబడే పరిస్థితి లేకుండా పోయింది.


అయితే పరిస్థితి ఇప్పుడు మారింది. పాలనా వ్యవస్థలో ప్రాతినిధ్యం ఉన్న నాయకులు సహజంగానే మునిసిపల్ కార్పొరేషన్‌పై దృష్టి పెట్టడం ప్రారంభించారు. అంతేకాక, ప్రస్తుత మేయర్ స్ర‌వంతి పై వివిధ ఆరోపణలు రావడం రాజకీయంగా మార్పుకు తోడ్పడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక స్థానిక సంస్థల్లో టీడీపీ తన ఆధిపత్యాన్ని చూపించింది. ఇప్పుడు నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ విషయంలో కూడా అదే దిశగా టీడీపీ కదులుతోంది. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోట్లంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వంటి ముఖ్య నాయకులు నెల్లూరులో వైసీపీ ప‌రిస్థితి రివ‌ర్స్ చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ అంతర్గతంగా సమీకరణాలు బలోపేతం అవుతుండగా… నెల్లూరులో ఎన్నికల వాతావరణం మళ్లీ కుదురడానికి అవకాశం కనిపిస్తోంది.


కానీ వైసీపీ వైపు మాత్రం ఎలాంటి రియాక్ష‌న్‌ కనిపించడం లేదు. సాధారణంగా పార్టీకి కీలకమైన స్థానం దెబ్బతింటే అత్యవసర సమీక్షలు, నాయకత్వ మార్పులు లేదా నష్టాన్ని నియంత్రించే చర్యలు చేపట్టడం సహజం. కానీ నెల్లూరు విషయంలో వైసీపీ నాయకత్వం “ఏం జరుగుతుందో జరుగుతుంది” అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఇది పార్టీకి తీవ్ర నష్టం కలిగించే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా నెల్లూరు లో వైసీపీ ఇప్ప‌టి నుంచి కాన్‌సంట్రేష‌న్ చేయ‌క‌పోతే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కంచుకోట‌ల్లో అంత బ‌ల‌ప‌డే సూచ‌న‌లు అయితే క‌న‌ప‌డ‌డం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: