హైదరాబాద్: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మూడు రోజుల ఉపవాస దీక్షకు దిగిన విషయం విధితమే. కిషన్ దీక్ష కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తేవడం మాటటుంచితే...బీజేపీకి మాత్రం కొంత గడువును పెంచుకోవడానికి ఉపయోగపడ్డదనే విమర్శలు ఆ పార్టీని చుట్టుముడుతున్నాయి. అదెట్లా అంటే....భారతీయ జనతా పార్టీ మొదటి నుంచీ చిన్న రాష్ర్టాల ఏర్పాటుకు కట్టుబడి వుంది. తెలంగాణ కోసం తనదైన శైలిలో గల్లీ లీడర్ మొదలుకుని ఢిల్లీ లీడర్ వరకు కొట్లాడుతున్నారు. తెలంగాణలోని పాలమూరు, పరకాల అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆ పార్టీ జాతీయ నాయకురాలు సుష్మాస్వరాజ్ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు చేస్తామనీ హామీ ఇచ్చింది. ఢిల్లీలో కూడా ఆ పార్టీ అగ్రనేత అద్వానీ వంటి నేతలు కూడా ఇదే చెప్పారు. బీజేపీ అగ్రనేతల మాటల్ని నమ్మి పాలమూరు ప్రజలు బీజేపీ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డిని గెలిపించారు. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ కట్టుబడాలనీ బీజేపీ నేత కిషన్... తెలంగాణ పోరు దీక్షకు సంబంధించి ఢిల్లీ వేదికగా దూకుడు పెంచారు. అదే సమయంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే మూడు నెలల్లో రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేస్తామన్న నాయకులు...తాజాగా జంతర్ మంతర్ వేదికగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోగా రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేస్తామనీ ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇప్పుడంతటా సింగ్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలో 100రోజులు అని మాట్లాడిన నాయకులు ఢిల్లీకి వెళ్లే సరికి 200రోజులంటూ మాట్లాడటాన్ని తప్పుబడుతున్నారు. ఇది వరకు ‘ఒక ఓటు రెండు రాష్ర్టాలు’ అని చెప్పిన బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ అడ్డుపడటంతో తెలంగాణను ఇవ్వలేకపోయామనీ తప్పించుకుంది. ఇప్పుడు మరోమారు తనంతటా తానుగా ప్రకటించిన 100రోజులను కాస్త 200రోజులకు పెంచడం పట్ల బీజేపీకి కూడా తెలంగాణపై చిత్తశుద్ధి లేదనేది చెప్పకనే చెబుతున్నట్లుందనీ అప్పుడే రాజకీయ నాయకులు, విశ్లేషకుల నుంచీ విమర్శల దాడి మొదలైంది. ఏది ఏమైనా కిషన్ రెడ్డి ఢిల్లీ దీక్ష కాంగ్రెస్ పై ఒత్తిడి తెస్తుందనీ అందరూ భావించారు. కానీ, ఆ దీక్ష కాస్త బీజేపీ గడువు పెంచుకోవడానికి ఉపయోగపడ్డదే తప్ప మరొకటి కాదనీ అందరూ పెదవి విరుస్తున్నారు. సింగ్ మాటలతో కిషన్ దీక్ష కాస్త ‘బూడిదలో పోసిన పన్నీరు’గా మారింది. మరి కమలనాథులు ఏం చెబుతారో చూద్దాం మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: