హైదరాబాద్: ఇప్పుడు అందరూ తెలం‘గానం’ గురించి మాట్లాడుతున్నారు. రాష్ర్టపతి ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారా? లేక నిజంగానే తెలంగాణ అంశాన్ని తేల్చే దిశగా కాంగ్రెస్ అధిష్టానం అడుగులు వేస్తుందా?లేక కావాలనే డ్రామాలు ఆడుతున్నారో తెలియదు కాని, మొత్తానికి అందరూ తెలంగాణ ఘట్టం తుది దశకు చేరుకుందంటూ సెలవిస్తున్నారు. తెలంగాణను వ్యతిరేకించే పచ్చి సమైక్యవాదుల నుంచి తెలంగాణ మాటలు వస్తున్నాయి. ఎవరయితే తెలంగాణను వ్యతిరేకిస్తున్నారో వారే తెలంగాణ అంశం తేలిపోయే సమయం ఆసన్నమైందంటున్నారు.  మొన్నరాయలసీమకు చెందిన మంత్రి టీజీ వెంకటేశ్.....నిన్న ఉత్తరాంధ్రకు చెందిన పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ. సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ నేతల నోటి వెంట వస్తున్న తెలం‘గానం’పై ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. తాజాగా పీసీసీ చీఫ్ బొత్స తెలంగాణ గురించి మాట్లాడటం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది. అయితే, ముందుగా అనుకుంటున్నట్లుగానే ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో పెను మార్పులు తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఫలితాలు కాంగ్రెస్కు అటు సీమాంధ్రలోనూ, ఇటు తెలంగాణలోనూ షాక్ ఇచ్చాయి. ఫలితాలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్ర అసంత్రుప్తిని వ్యక్తం చేశారు. సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్సలను క్లాస్ తీసుకున్నారు.  జగన్ ప్రభావం, తెలంగాణ సెంటిమెంటు కలిపి కాంగ్రెస్ను ఊపిరాకుండా చేస్తున్నాయి. రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి బలపడటానికి తెలంగాణ దిశగా ఢిల్లీలో కాంగ్రెస్ అడుగులు వేస్తున్నట్లు పీసీసీ చీఫ్ బొత్సత, మంత్రి టీజీ వెంకటేశ్ వ్యాఖ్యలు సమాధానమిస్తున్నాయి. ఎప్పుడూ సమైక్యంధ్ర మాట మాట్లాడే రాయలసీమకు చెందిన టీజీ, పీసీసీ బొత్స ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడగొట్టడానికి ఇష్టపడని టీజీ నోట వస్తున్న తెలాం‘గానం’ మాటలు చర్చనీయాంశంగా మారాయి. అదే విధంగా పీసీసీ హోదాలో ఉన్న బొత్స కూడా రాష్ర్టపతి ఎన్నికల తరువాత తెలంగాణపై ఓ క్లారిటీ వస్తుందంటున్నారు. బలంగా సమైక్యను వినిపించే టీజీ తెలంగాణపై తుది నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందంటున్నారు.  టీజీ, పీసీసీ మాటలను బట్టి తెలంగాణ అంశాన్ని ఇంకా నాన్చడం వల్ల లాభం లేదనే నిర్ణయానికి కాంగ్రెస్ వచ్చినట్లుంది. హైకమాండ్ నుంచి వచ్చిన సంకేతాలతోనే పీసీసీ, టీజీ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడినట్లు తెలంగాణవాదులు భావిస్తున్నారు. దీనికి తగ్గట్లుగానే టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూడా సీమాంధ్రుల పట్ల అనుకూలంగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ స్వరంలో కూడా మార్పు వచ్చింది. రాష్ర్టపతి ఎంపిక తరువాత తెలంగాణపై కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకోవచ్చని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు.  తెలంగాణపై అనుకూలమైన నిర్ణయం తీసుకుంటారనే ఆందోళన తనకు కలుగుతోందనీ టీజీ అనడం, పీసీసీ చీఫ్ బొత్స తెలంగాణ ఏర్పాటో, సమక్యంగా ఉండటమో తేతిపోతుందని అనడం బట్టి...కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణపై కసరత్తు చేస్తుందని ఆయన చెప్పకనే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట విభజనపై ఇప్పుడు నిర్ణయం తీసుకోకున్నా, ఆ నిర్ణయం తీసుకునే టైం మాత్రం వచ్చిందని చెప్పొచ్చు. మొత్తానికి సమైక్యాంధ్రను కోరుకునే వారి స్వరం మారడంతో తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన నిర్ణయం తీసుకోవచ్చని అందరూ ఆశతో ఉన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: