తిరుచానూరులో వెలసియున్న పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో  ఆఖరి రోజు పంచమి తీర్థ ఉత్సవం నిర్వహించడం ఆగమ శాస్త్ర ఆనవాయితీ . ఈ సందర్భాన్ని పురస్కరించుకుని  బుధవారం పంచమితీర్థం ఉత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కార్యక్రమాన్ని సంప్రదాయ బద్దంగా నిర్వహించింది. తిరుమల కొండ పై ఉన్న శ్రీనివాస ప్రభువు, తిరుచానూరు లోని  పద్మావతి అమ్మవారికి సారె పంపించారు. శ్రీవారి ఆలయం నుంచి టిటిడి అధికారులు ఈ సారెను సంప్రదాయ బద్ధంగా తీసుకుని వచ్చారు.
 ఈ సంద‌ర్భంగా  825 గ్రాములు బ‌రువుగ‌ల కెంపులు,పచ్చలు, నీలములు,  ముత్యాలు పొదిగిన బంగారు పతకము, రెండు బాజీ బందులు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి కానుక‌గా స‌మ‌ర్పించారు.ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి పాల్గొన్నారు.
వాస్తవానికి ఈ కార్యక్రమం
  శ్రీవారి ఆలయంలో వేకువనే ప్రారంభమైంది.  ఉదయం 2.30 నుంచి నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన మిశ్రమాన్ని తయారు చేశారు... దీనినే పరిమళం అని కూడా అంటారు. ఈ పరిమళపు ముద్దను తొలుతగా   విమాన ప్రాకారంలో ఊరేగింగి , ఆపై  శ్రీవారి వక్ష:స్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వ‌హించారు. ఆ త‌రువాత ఉదయం 4.30 గంటల ప్రాంతంలో తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణాలతో కూడిన సారె ఊరేగింపు  ఆరంభమైంది. ఈ సారెను  ఎనుగులపై ఉంచి ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగించారు.. అక్కడ నుంచి  కాలినడకన తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకెళ్లారు.  ఆ తరువాత  కోమ‌ల‌మ్మ స‌త్రం, తిరుచానూరు పసుపు మండపం మీదుగా  తిరుచానూరు ఆలయం వ‌ద్ద అమ్మ‌వారికి సారె స‌మ‌ర్పించారు.  ఆభ‌ర‌ణంతో కూడిన శ్రీ‌వారి సారెను అలిపిరి వ‌ద్ద అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తిరుప‌తి జెఈవో శ్రీ వీరబ్రహ్మంకు అంద‌జేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వ‌ద్ద ఆయన ఈవో  డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డికి జెఈవో అందించారు.

  వాహన మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్‌కు ఉదయం 10 గంటల నుండి 11.30 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. కుంకుమ పూవు, యాలకులు, ఆప్రికాట్ గ్రేప్స్, నెమలి ఈకలు, కొబ్బరి ఆకు, రోజా పూలు, తులసి మాలలు, కిరీటాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.

   

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd