గ్ర‌హ‌ణం వేళ రోక‌లి రోలు నిలువుగా నిల‌బడుతుంద‌ని పూర్వీకుల నుంచి వింటున్నాం..కానీ చూసిన వాళ్లు బ‌హుశా లేర‌నే చెప్పాలి. అయితే ఆదివారం సూర్యగ్రహణం నేప‌థ్యంలో విజయనగరం జిల్లా పార్వతీపురంలో భ‌క్తులు వినూత్న ప్ర‌యోగం చేశారు. ఇత్తడి పళ్ళెంలో రోకలి నిలబెట్టారు ప‌లువురు మహిళలు. గ్రహణం ఉన్నంత‌సేపు స‌పోర్ట్ లేకుండా రోక‌లి నిల్చోని ఉంటుంద‌ని.. అనంతరం అది పడిపోతుందని భ‌క్తుల విశ్వాసం. వీరు చేసిన ప్ర‌యోగం స‌ఫ‌లం కావ‌డంతో ఇప్పుడు వారంతా  గ్రహణం ప్రభావం వల్లే రోకలి నిలబడింద‌ని మ‌హిళ‌లు ఘంటాప‌థంగా చెబుతున్నారు. తమ పూర్వీకుల నుంచి ఈ ఆచారం పాటిస్తున్నామ‌ని పేర్కొన్నారు.జ‌న విజ్ఞాన వేదిక సంఘం నాయ‌కులు మాత్రం ఈ విష‌యాన్ని కొట్టిపారేస్తున్నారు. జ‌నాల‌ను మూఢ న‌మ్మ‌కాల వైపు న‌డిపించ‌డం మానుకోవాల‌ని అంటున్నారు.

 

మ‌రోవైపు ఈ గ్ర‌హ‌ణ స‌మ‌యంలో ప‌ట్టు, విడుపులు ఉండాలని..కొన్ని రాశుల వారికి ఇది అశుభ‌మ‌ని, మ‌రికొన్ని రాశుల‌వారికి \ శుభ‌వని శాస్త్ర పండితులు, జ్యోతిష్యులు పేర్కొన్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు క‌మ్ముకున్న నేప‌థ్యంలో కొన్ని ప్రాంతాల‌లో గ్ర‌హ‌ణం చూసేందుకు అవ‌కాశం కుద‌ర‌డం లేదు. ఇక‌ ఈ సంవ‌త్స‌రం మొద‌టి సూర్యగ్రహణం ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా క‌నువిందు చేస్తోంది. ఉదయం 9.16 గంటల నుంచి రాహుగ్రస్త సూర్యగ్రహణం ప్రారంభం కాగా.. ఇండియాలో తొలుత గుజరాత్‌లోని ద్వారకలో ఉదయం 10.14 గంటలకు మొద‌ట‌ గ్రహణం అక్కడ ఆరంభమయ్యింది. 


ఈ గ్ర‌హణం చూసేందుకు ఇండియాలోని చాలా ప్రాంతాల్లో ప్ర‌జ‌లు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. ఇది ఖ‌గోళ అద్భుతమ‌ని, త‌గిన జాగ్ర‌త్త‌లు పాటిస్తూ గ్ర‌హ‌ణం చూడొచ్చ‌ని సైంటిస్టులు చెబు‌తున్నారు. సూర్య గ్ర‌హాణానికి శాస్త్రంలో అశుభ సంకేతాలే ఉండ‌టం గ‌మ‌నార్హం. ఆదివారం సూర్యగ్రహణం సమయంలో ప్రపంచ శాంతి, సృష్టిలోని సకల జీవరాశుల క్షేమాన్ని కోరుతూ తిరుమల శ్రీవారి పుష్కరిణిలో టీటీడీ జపయజ్ఙం నిర్వహించనుంది. ఇందులో భాగంగా అష్టాక్షరి, ద్వాదశాక్షరి, శ్రీ ధన్వంతరి మంత్ర జపాలతోపాటు శ్రీపురుష సూక్త, శ్రీసూక్త, శ్రీ నారాయణ సూక్త పారాయణాలను నిర్వహించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: